Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో సరికొత్త మిలటరీ ఆపరేషన్‌...రంగంలోకి నార్త్‌ కొరియా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా పాత్ర మరింత పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యాకు డ్రోన్ ఆపరేటర్లు, సైనికులు, క్షిపణులను సరఫరా చేస్తున్నట్టు ఉక్రెయిన్‌ పేర్కొంటోంది.

Balachander
Published on: 22 Aug 2026 1:03 PM IST
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో సరికొత్త మిలటరీ ఆపరేషన్‌...రంగంలోకి నార్త్‌ కొరియా
X

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఒక ఊహించని పరిణామం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దికాలంగా రష్యాకు మిలటరీ మద్దతు ఇస్తున్న ఉత్తర కొరియా, ఇప్పుడు నేరుగా డ్రోన్ దాడి దళాలను రంగంలోకి దించింది. రష్యాలోని కుర్స్క్ రీజియన్‌లో ఇప్పటికే ల్యాండ్ అయిన 8,500 మంది ఉత్తర కొరియా దళాల్లో దాదాపు 400 మంది నైపుణ్యం కలిగిన డ్రోన్ ఆపరేటర్లు ఉండటం అంతర్జాతీయ మిలటరీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఉక్రెయిన్ అంతర్గత సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే ఈ ప్రత్యేక విభాగం ప్రధాన బాధ్యత.

ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ హెడ్ మేజర్ జనరల్ వదిమ్ స్కిబిట్స్కీ వెల్లడించిన కథనం ప్రకారం, రెండు దేశాల మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ఆధారంగా ఉత్తర కొరియా తన మిలటరీ బలగాలను రష్యాకు పంపుతోంది. సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల సమావేశం తర్వాతి దశలో ఏకంగా 50,000 మంది సైనికులను పంపే దిశగా రష్యా అడుగులు వేస్తోంది.

ఉత్తర కొరియా వ్యూహాత్మక ప్లాన్ ... మిలటరీ డేటా

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక దాదాపు 25,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగం గుండా యుద్ధ క్షేత్రానికి చేరుకున్నారు. కాగా ప్రత్యక్ష యుద్ధరంగంలో ఉన్న 8,500 మందిలో 1,000 మంది ఇంజనీర్లు, మైన్‌ డిస్పోజల్ సిబ్బందితో పాటు 400 మంది హైటెక్ డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారు. కాగా, ఈ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల లోపల నేరుగా పోరాడకుండా, రష్యా వెనుక వరుస పొజిషన్లను కాపాడతారు. దీనివల్ల రష్యా తన సొంత సైన్యాన్ని ఉక్రెయిన్ లోపలికి మరింత దూకుడుగా పంపడానికి వీలవుతుంది.

ఆయుధ సహకారం

కేవలం మానవ వనరులే కాకుండా రష్యాకు అవసరమైన అత్యాధునిక క్షిపణులను కూడా కిమ్ ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు 150కి పైగా KN-23, KN-24 బాలిస్టిక్ క్షిపణులను రష్యా ఉపయోగించగా, మరో 120 క్షిపణులు త్వరలోనే డెలివరీ కానున్నాయి. 800 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ వద్ద ఇంటర్‌సెప్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం ఉక్రెయిన్ వైమానిక దళానికి పెద్ద సమస్యగా మారింది.

ఉత్తర కొరియాకు పాంట్సిర్‌ 1

ఈ మిలటరీ సహాయానికి ప్రతిఫలంగా రష్యా నుంచి ఉత్తర కొరియా ఉచితంగా ఏమీ పొందడం లేదు. రష్యాకు చెందిన శక్తివంతమైన 'పాంట్సిర్-1' సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను ఉత్తర కొరియా ఇప్పటికే అందుకుంది. దీంతోపాటు రష్యా అత్యంత ప్రతిష్టాత్మకమైన 'S-400' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా ఇవ్వాలని ఉత్తర కొరియా ఒత్తిడి తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధభూమిని ఒక ప్రయోగశాలగా వాడుకుంటూ ఉత్తర కొరియా తన మిస్సైల్ టెక్నాలజీని, డ్రోన్ దాడుల నైపుణ్యాన్ని ఆధునీకరించుకోవడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించనున్నట్లు ప్రకటించడం నాటో కూటమిని మరింత కలవరపెడుతోంది. ఉత్తర కొరియా అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఆధారాలు ఆసియా-యూరప్ భూరాజకీయాల్లో సరికొత్త రక్షణ సంక్షోభాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story