Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ పోరులో బిగ్ రిలీఫ్.. అక్టోబర్ 27 నుంచి కాల్పుల విరమణ

Russia-Ukraine War: రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉపశమనం లభించింది.

CR Reddy
Published on: 24 Oct 2026 6:05 AM IST
Russia-Ukraine War
X

Russia-Ukraine War

Russia-Ukraine War: రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉపశమనం లభించింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓలేష్కీ నగరంలో మానవీయ సహాయం అందించేందుకు స్థానిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ నేతృత్వంలో సాగిన దౌత్య చర్చల కారణంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ చర్చల ప్రతినిధి దిమిత్రో లుబినెట్స్ తెలిపిన కథనం ప్రకారం..అక్టోబర్ 27వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటల నుంచి (మాస్కో కాలమానం ప్రకారం) ఈ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.

మెలానియా ట్రంప్ మిషన్ వివరాలు

గత నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఓలేష్కీ నగర ప్రజల దయనీయ స్థితిని తెలుసుకున్న మెలానియా ట్రంప్, వెంటనే రష్యా, ఉక్రెయిన్ అగ్ర నాయకత్వాలతో సంప్రదింపులు జరిపారు. ఈ చొరవపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా చర్చించారు. ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రధాన ఉద్దేశం యుద్ధం వల్ల విడిపోయిన రష్యన్, ఉక్రేనియన్ చిన్నారులను తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేవరకూ భద్రత కల్పించడం. ఇప్పటివరకు దాదాపు 36 మంది పిల్లలను కుటుంబాల చెంతకు చేర్చినట్లు సమాచారం.

ల్యాండ్ మైన్ల తొలగింపు

యుద్ధ ప్రాంతమైన ఓలేష్కీలో సాయం అందించే ముందు అనేక సాంకేతిక సవాళ్లను దాటాల్సి ఉంది. నగరానికి వెళ్లే దారుల్లో నిండిపోయిన ప్రమాదకరమైన ల్యాండ్ మైన్లను తొలగించడం అత్యంత కీలకం. రష్యా జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వలేరి గేరాసిమోవ్ ప్రకటన ప్రకారం, ఖేర్సన్ ప్రాంతంలో రష్యన్ బలగాలు మంగళవారం నుంచి కాల్పులను విరమించి ఇంజనీరింగ్ తనిఖీలను నిర్వహిస్తాయి. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ఆహారం, మందులు అలాగే అత్యవసర సహాయక సామాగ్రితో కూడిన కాన్వాయ్‌లు నగరంలోకి ప్రవేశిస్తాయి.

ఓలేష్కీ నగరంలో దయనీయ పరిస్థితులు

ప్రస్తుతం ఓలేష్కీ నగరం అత్యంత కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. జూన్ 2023లో కాఖోవ్కా డ్యామ్ పేలుడు తర్వాత వచ్చిన వరదల వల్ల ఈ నగరం దారుణంగా దెబ్బతింది. దానికి తోడు అక్కడ విద్యుత్ సరఫరా, తాగడానికి నీరు, చలి నుంచి తట్టుకునే హీటింగ్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. చలికాలం ప్రారంభమవుతున్న వేళ నగరంలో మిగిలిపోయిన ప్రజలు ఆకలి, రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ తరుణంలో కుదిరిన శాంతి ఒప్పందం అక్కడి పౌరులకు నిజమైన సంజీవనిలా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.