Russia Ukraine War: ట్రంప్‌తో జెలెన్స్కీ ఫోన్ కాల్.. భారత్, చైనా దేశాలకు టెన్షన్

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

CR Reddy
Published on: 21 Sept 2026 8:17 AM IST
Volodymyr Zelenskyy
X

Volodymyr Zelenskyy

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ ద్వారా అత్యంత కీలకమైన చర్చలు జరిపారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. త్వరలోనే న్యూయార్క్ నగరంలో ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఇద్దరూ అంగీకరించారని, ఈ సమావేశం ఉక్రెయిన్-రష్యా యుద్ధ గతిని పూర్తిగా మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిప్లమాటిక్ స్థాయిలో చర్చలు పురోగతి సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

అమెరికన్ ప్రతినిధి బృందం ఇటీవల కీవ్ నగరంలో పర్యటించిన విషయాన్ని జెలెన్స్కీ గుర్తుచేసుకుంటూ ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుషెనర్ కీవ్‌లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించారని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని స్థాపించడమే తమ దేశం, అత్యంత ప్రాథమిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి తమ వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడటం వంటి కీలక అంశాలపై అమెరికా బృందంతో కలిసి గట్టిగా పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన బిల్లును చట్టంగా మార్చడంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అమెరికా సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచమంతా శాంతి కోరుకుంటోందని, ఉక్రెయిన్ కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరింత ఉక్కుపాదం మోపుతున్నారు. రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులపై కఠిన ఆంక్షలు విధిస్తూ సెప్టెంబర్ 18న శాక్షనింగ్ రష్యా యాక్ట్ 2026 బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఈ నూతన చట్టం అమలులోకి రావడంతో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై ఏకంగా 100% దిగుమతి సుంకం విధించే ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.