Russia Ukraine War : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడితో విరుచుకుపడ్డ రష్యా.. 12 మంది మృతి, 40 మందికి గాయాలు

Russia Ukraine War : రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ మరోసారి అతలాకుతలమైంది. 12 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ డ్రోన్ల దెబ్బకు రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది.

CR Reddy
Published on: 30 Jun 2026 6:30 AM IST
Russia Ukraine War
X

Russia Ukraine War

Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధం మరింత భీకర రూపాన్ని దాల్చింది. సోమవారం ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా సైన్యం క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘోర దాడుల్లో కనీసం 12 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని, ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇప్పటివరకు 16 వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ఈ యుద్ధానికి బలియయ్యారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ మధ్య ప్రాంతంలోని నిప్రో నగరాన్ని టార్గెట్ చేస్తూ రష్యా ప్రయోగించిన ఒక శక్తివంతమైన క్షిపణి అక్కడి కీలక మౌలిక సదుపాయాలపై పడింది. ఈ ఒక్క దాడిలోనే ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 29 మంది తీవ్ర గాయాలపాలైనట్లు నిప్రో ప్రాంతీయ అధిపతి ఒలెక్సాండర్ హంజా వెల్లడించారు. మరోవైపు, దక్షిణ నగరమైన జపోరిజ్జియాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీబస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

సుమీ, ఖార్కీవ్ ప్రాంతాల్లోనూ మరణ మృదంగం

ఉక్రెయిన్ ఉత్తర-తూర్పు ప్రాంతాలైన సుమీ, ఖార్కీవ్ నగరాల్లోనూ రష్యా డ్రోన్లు వినాశనాన్ని సృష్టించాయి. సుమీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న 69 ఏళ్ల వృద్ధురాలు, 77 ఏళ్ల వృద్ధుడు రష్యా డ్రోన్ దాడికి బలయ్యారు. ఖార్కీవ్ నగరంలో పగటిపూట జరిగిన దాడిలో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారని మేయర్ ఇహోర్ తెరెఖోవ్ తెలిపారు. ఈ దాడుల వల్ల ఉక్రెయిన్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఒకవైపు భానుడి భగభగలతో ఎండలు దంచికొడుతుండటం, మరోవైపు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యూరప్ దేశాలకు జెలెన్స్కీ అత్యవసర పిలుపు

రష్యా బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే కూల్చేందుకు ఉక్రెయిన్‌కు మరింత అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అవసరమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమ దేశ ప్రజలను రష్యా అరాచకాల నుంచి కాపాడుకోవడానికి యాంటీ-బాలిస్టిక్ సామర్థ్యాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. యూరప్ దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతో పాటు, ఉక్రెయిన్‌కు అత్యాధునిక క్షిపణి నిరోధక సాంకేతికతను అందించి సహాయం చేయాలని ఆయన మరోసారి అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్ తిరుగుబాట

యుద్ధంలో ఉక్రెయిన్ కూడా రష్యాకు గట్టిగానే బుద్ధి చెబుతోంది. ఉక్రెయిన్ తయారు చేసిన సరికొత్త లాంగ్ రేంజ్ డ్రోన్లు రష్యాలోని చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలపై విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల దెబ్బకు రష్యాలో ఇంధన కొరత తీవ్రమైంది. రష్యా ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేసిన మాట నిజమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించారు. పెట్రోల్ బంకుల వద్ద రష్యా ప్రజలు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, అయితే ఇవేవీ తమ విజయ సంకల్పాన్ని అడ్డుకోలేవని, ఈ యుద్ధంలో రష్యాయే గెలుస్తుందని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు.

కలవరపడుతున్న క్రెమ్లిన్

రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ విషయంలో తమ వైఖరి మారలేదని, తమ లక్ష్యాలను సాధించే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయ రక్షణ నిపుణుల విశ్లేషణల ప్రకారం, యుద్ధభూమిలో రష్యా పట్టు క్రమంగా తగ్గుతోంది. అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం.. 2026 లో రష్యా సైనిక సామర్థ్యం, ప్రదర్శన బాగా క్షీణించాయి. గడిచిన 24 గంటల్లోనే రష్యా ప్రయోగించిన 108 డ్రోన్లలో 82 డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ గాల్లోనే కూల్చివేయడం ఉక్రెయిన్ ఎదురుదాడి వ్యూహానికి నిదర్శనంగా నిలిచింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story