Russian Missiles Breach NATO Airspace: యూరప్‌లో టెన్షన్... నాటో దేశాల్లోకి రష్యా క్షిపణి
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల వేళ పోలాండ్ గగనతలంలోకి క్షిపణులు, డ్రోన్లు ప్రవేశించాయి. స్వీడన్ గ్రిపెన్ యుద్ధవిమానం దాడి ఎందుకు నిలిపివేసింది? నాటో స్పందన, అమెరికా సైనిక బలగాల మోహరింపుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Russian Missiles Breach NATO Airspace: ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దాడులు ఇప్పుడు యూరప్‌లోని నాటో దేశాల భద్రతకు కూడా సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పోలాండ్ గగనతలంలోకి రష్యాకు చెందిన క్షిపణులు, డ్రోన్లు ప్రవేశిస్తున్న ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. నవంబర్ 20న పోలాండ్ గగనతలంలోకి వచ్చినట్లు అనుమానించిన రష్యా క్రూయిజ్ క్షిపణిని కూల్చేందుకు స్వీడన్‌కు చెందిన గ్రిపెన్ యుద్ధవిమానం సిద్ధమైనా.. చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిపోయింది. లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం నాటో దేశాల రక్షణ వ్యవస్థల్లో ఎదురవుతున్న సవాళ్లను మరోసారి బయటపెట్టింది.
వాతావరణం సహకరించక నిలిచిపోయిన దాడి
నవంబర్ 20న ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేపట్టింది. ఈ సమయంలో పోలాండ్ భద్రతా దళాలు 11 అనుమానాస్పద వైమానిక వస్తువులను గుర్తించాయి. వాటిలో మూడు పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించాయి. వీటిని ఎదుర్కొనేందుకు నాటో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో స్వీడన్‌కు చెందిన జేఏఎస్ 39 గ్రిపెన్ యుద్ధవిమానం కూడా పాల్గొంది. జర్మనీలోని ఉడెమ్ కేంద్రంగా పనిచేసే నాటో కంబైన్డ్ ఎయిర్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఆ విమాన పైలట్‌కు షరతులతో కూడిన అనుమతి లభించింది. లక్ష్యం రష్యా క్షిపణి అని నిర్ధారించగలిగితే దానిపై దాడి చేయవచ్చని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ లక్ష్యాన్ని కంటితోనూ, విమానంలోని ప్రత్యేక ఎలక్ట్రో ఆప్టికల్ పరికరాలతోనూ గుర్తించలేకపోయాడు. దీంతో క్షిపణిని ప్రయోగించకుండా ఆపరేషన్‌ను నిలిపివేశారు. పోలాండ్ సాయుధ దళాల ఆపరేషనల్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇరెన్యూష్ నోవాక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వస్తువు రష్యా ప్రయోగించిన ఖ్-101 క్రూయిజ్ క్షిపణి అయి ఉండవచ్చని తెలిపారు. అనంతరం మూడు ప్రాంతాల్లో లభించిన శకలాలు రష్యా ఖ్-101 క్షిపణులవేనని పోలాండ్ ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. దీంతో తొలుత వ్యక్తమైన డ్రోన్ అనుమానానికి తెరపడింది.
నాలుగు రోజుల్లో మరోసారి గగనతల ఉల్లంఘన
ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే, నవంబర్ 24 రాత్రి మరోసారి రష్యా డ్రోన్ పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించింది. పోలాండ్ బలగాలు దానిని గుర్తించి కూల్చేందుకు అనుమతి పొందాయి. అయితే డ్రోన్ దిశ మార్చుకుని తూర్పు వైపు వెళ్లడంతో దాడి చేయలేదు. నేలపై ఉన్న ప్రజలకు, ఆస్తులకు ప్రమాదం కలగవచ్చనే కారణంతో సైన్యం సంయమనం పాటించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చొరబాటు అయి ఉండవచ్చని పోలాండ్ ఉప రక్షణ మంత్రి పావెల్ జలెవ్‌స్కీ అభిప్రాయపడ్డారు.
పోలాండ్‌కు అమెరికా సైనిక బలం కావాలి
ఈ వరుస ఘటనల నేపథ్యంలో పోలాండ్ తన భద్రతకు మరింత బలమైన హామీలు కోరుతోంది. నవంబర్ 23న నాటో అత్యవసర సమావేశంలో గగనతల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను పోలాండ్ వెల్లడించింది. దీనికి స్పందించిన నాటో, గగనతల నిఘాను బలోపేతం చేసేందుకు ఏవాక్స్ నిఘా విమానాన్ని పోలాండ్‌కు పంపాలని నిర్ణయించింది. మరోవైపు, తమ దేశంలో అమెరికా సైనికుల శాశ్వత మోహరింపును పెంచాలని వార్సా కోరుతోంది. ప్రస్తుతం సుమారు 7,000 మంది అమెరికా సైనికులు పోలాండ్‌లో రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను 10,000 వరకు పెంచే ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని సెప్టెంబర్‌లో పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం నాటో సరిహద్దుల వరకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన ఇప్పుడు యూరప్‌లో పెరుగుతోంది. లక్ష్యాన్ని గుర్తించలేక క్షిపణిని అడ్డుకోలేకపోయిన గ్రిపెన్ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. ఆధునిక యుద్ధ విమానాలు, నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించడం అత్యంత కీలకం. పొరపాటున పౌర విమానాన్ని లేదా మరో వస్తువును లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉన్నందున, నాటో బలగాలు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.




