Russia Ukraine war: 400 డ్రోన్లు, 110 క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడి.. 8 మంది మృతి

క్రిమియా బ్రిడ్జ్‌పై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగా రష్యా విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 110 క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది.

CR Reddy
Published on: 21 Nov 2026 8:08 AM IST
Russia Ukraine war
X

Russia Ukraine war

Russia Ukraine war: క్రిమియా బ్రిడ్జ్‌పై ఉక్రెయిన్ చేసిన దాడికి రష్యా భీకరంగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌లోని పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా ఏకంగా 400లకు పైగా డ్రోన్లు, 110కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 27 బాలిస్టిక్ మిసైళ్లు ఉండగా, కొన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులు కూడా ఉన్నాయి. గాల్లోనే పేలిపోయి విశాలమైన ప్రాంతంలో చిన్న చిన్న బాంబులను వెదజల్లే ఈ క్లస్టర్ బాంబులతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈ దాడుల్లో కనీసం 8 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా, రెండు డజన్లకు పైగా ప్రజలు గాయపడ్డారు.

కీవ్, ల్వీవ్‌లో విధ్వంసం

క్రిమియాను రష్యాతో కలిపే వంతెనపై దాడికి బదులు తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. రాజధాని కీవ్‌లో ఆరుగురు మృతి చెందగా, పశ్చిమ నగరం ల్వీవ్‌లోని స్క్నిలివ్ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నివాస భవనాలు, ఆసుపత్రులు, గోదాములు, రైల్వే కేంద్రాలను రష్యా లక్ష్యంగా చేసుకుంది. కీవ్ నగరంలోని రెండు భాగాలను కలిపే నీపర్ నదిపై ఉన్న మూడు వంతెనలు కూడా ఈ దాడుల్లో దెబ్బతిన్నాయి. అయితే తాము కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫ్లెమింగో క్షిపణి తయారీ కేంద్రం, రాకెట్ ఇంధన విడిభాగాల ఫ్యాక్టరీ, డ్రోన్ తయారీ కేంద్రాలపై దాడి చేసినట్లు రష్యా చెప్పుకొచ్చింది.

11 ప్రాంతాల్లో కరెంట్ కట్

రష్యా చేసిన ఈ భారీ దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, పవర్ లైన్లపై బాంబులు పడటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని ఉక్రెయిన్ డిప్యూటీ ఎనర్జీ మినిస్టర్ ఆర్టెమ్ నెక్రాసోవ్ తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు అణు విద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. దీని ఫలితంగా ఉక్రెయిన్‌లోని 11 ప్రాంతాల్లో అత్యవసర విద్యుత్ కోతలు విధించారు. చలికాలంలో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

రంగంలోకి పోలాండ్ సైన్యం

రష్యా దాడుల ప్రభావం పొరుగు దేశాలపైనా పడింది. దాడుల తర్వాత పోలాండ్ గగనతలంలోకి అనుమానాస్పద వస్తువులు చొరబడినట్లు వార్తలు రావడంతో పోలాండ్ సైన్యం వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించింది. ఈ పరిణామంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా స్పందిస్తూ.. రష్యా చేస్తున్న ఈ దాడులు కేవలం ఉక్రెయిన్‌కే కాదు, యావత్ యూరప్ భద్రతకే పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

క్రిమియా బ్రిడ్జ్‌పై దాడి, శాంతి చర్చల మధ్య ఉద్రిక్తత

రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాను రష్యా ప్రధాన భూభాగంతో కలిపే క్రిమియా బ్రిడ్జ్‌పై ఈ వారమే ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యా సైన్యానికి ఆయుధాలు, సైనికులను పంపడానికి ఈ వంతెన అత్యంత కీలకమైన మార్గం కావడంతో, ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో దీనిపై విరుచుకుపడింది. ఒకవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు, ప్రతిదాడులు జరగడం గమనార్హం. శాంతి ఒప్పందం షరతులపై ఇరు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.