Sailors: ఇంకొన్నాళ్లు ఇలానే ఉంటే చచ్చిపోతాం... హోర్ముజ్‌ దిగ్భందంతో పెరుగుతున్న ఒత్తిడి

స్వేచ్ఛగా సముద్రంపై ప్రయాణించే షిప్పులు గత మూడు నెలలుగా ఒకేచోట లంగరు వేయడం, ఎప్పుడు ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయోననే భయం మధ్య నావికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Balachander
Published on: 3 Jun 2026 1:13 PM IST
Sailors: ఇంకొన్నాళ్లు ఇలానే ఉంటే చచ్చిపోతాం... హోర్ముజ్‌ దిగ్భందంతో పెరుగుతున్న ఒత్తిడి
X

Sailors: అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో ఇరాన్‌కు మొదలైన యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలోని 'హోర్ముజ్ జలసంధి' పూర్తిగా మూతపడింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ సముద్ర మార్గం దిగ్బంధానికి గురికావడంతో, ప్రపంచ ఇంధన సరఫరా కుప్పకూలడమే కాకుండా వేలాది మంది నావికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. సుమారు 1,600 సరుకు రవాణా నౌకలు, అందులోని 20,000 మంది సిబ్బంది గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోనే బందీలుగా చిక్కుకుపోయారు. ఈ షిప్పుల్లో చిక్కుకుపోయిన నావికుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. శారీరకంగా, మానసికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సముద్ర గర్భంలో మానసిక నరకం

నిత్యం సముద్రంలో ప్రయాణించే నావికులకు సముద్రం అంటే భయం లేకపోవచ్చు. కానీ, ప్రశాంతంగా నెలల తరబడి లంగరు వేసిన నౌకల్లో ఉండాలంటే ఎవరికైనా భయమే. చుట్టూరు యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ భయం మరింత తీవ్రంగా మారి మానసిక ఆందోళనగా మార్పు చెందుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తలపై నుంచి దూసుకుపోతున్న మిస్సైళ్లు...సముద్రంలో మందుపాతరలు క్షణక్షణం భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో సుమారు 11 మంది నావికులు మృతిచెందారు. గర్జించే సముద్ర ఘోషను తట్టుకొని నిలబడిన నావికులు చిన్న చిన్న శబ్దాలకు చిగురుటాకులా వణికిపోతున్నారు.

అందని ఆహరం...ఆకాశంలో ధరలు

సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆహారం, తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారిపోయింది. బంగ్లాదేశ్‌కు చెందిన బంగ్లార్‌ జాయ్‌జాత్ర నౌక ఇంజనీర్‌ రషీదుల్‌ హసన్‌ చెప్పిన వివరాల ప్రకారం...గతంలో 180 టన్నుల తాగునీటి కోసం సుమారు 1500 నుంచి 2000 డాలర్ల వరకు ఖర్చు అయ్యేది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని నీటిని సప్లై చేసేవారు సుమారు 11వేల డాలర్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.

టోల్‌ఫీజులు...బతుకుజీవుడా అంటున్న బంగ్లా నౌకలు

ఇరాన్‌ పెట్టిన నిబంధనల ప్రకారం కొన్ని కోట్ల రూపాయల టోల్‌ ఫీజులు చెల్లించాలి. ఈ ఫీజులు చెల్లిస్తేనే నౌకలను వదిలేస్తామని ఇరాన్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, చైనా, భారత్‌ వంటి దేశాలు తమ దౌత్యనీతిని ఉపయోగించి చర్చల ద్వారా ఫీజులు లేకుండా బయటపడుతున్నాయి. అడపాదడపా మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్‌ షిప్పులు కూడా ఏదో విధంగా దారి మళ్లుతున్నాయి. కానీ, బంగ్లాదేశ్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. ఎంత భారమైన ఫీజు చెల్లించేందుకు సిద్దపడినా... ఫీజు చెల్లిస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరిస్తుండతంతో పాపం బంగ్లా నౌకలు ఇరాన్‌, అమెరికా మధ్య నలిగిపోతున్నాయి.

ఈ హోర్ముజ్ జలసంధి గుండానే ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ రవాణా అవుతుంది. ఇప్పుడిది మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలమవుతోంది. కాంట్రాక్టులు ముగిసినా ఇంటికి వెళ్లలేక, కనీసం పిల్లల కోసం కొన్న ఆటవస్తువులను వారికి చేర్చలేక నావికులు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నావికా వృత్తిలోకి రావడానికి ఎవరూ సాహసించకపోవచ్చు. ఇలానే ఈ షిప్పుల్లో ఇంకొన్నాళ్లు మగ్గిపోతే మరణం తప్ప మరొక మార్గం లేదని నావికులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి హోర్ముజ్‌ జలసంధి నుంచి ప్రయాణం అంటేనే భయపడే స్థితికి చేరుకున్నాయి పరిణామాలు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story