Saudi Arabia: సౌదీ యువరాజు షాకింగ్ డీల్.. హూతీలు దాడులు ఆపితే ఏకంగా 9,500 కోట్లు బహుమతి!

Saudi Arabia: హూతీ తిరుగుబాటుదారుల దాడులను ఆపేందుకు సౌదీ అరేబియా 1 బిలియన్ డాలర్ల భారీ ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం వివరాలు ఇవే.

Arun Chilukuri
Published on: 27 Oct 2026 12:59 PM IST
Saudi Arabia
X

Saudi Arabia: సౌదీ యువరాజు షాకింగ్ డీల్.. హూతీలు దాడులు ఆపితే ఏకంగా 9,500 కోట్లు బహుమతి!

Saudi Arabia: పశ్చిమాసియాలో సౌదీ అరేబియా మరియు హూతీ తిరుగుబాటుదారుల మధ్య సాగుతున్న దాడులు తీవ్ర రూపాంతరం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీలోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలపై హూతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తుండటంతో సౌదీ అరేబియా తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హూతీలతో రాజీకి వచ్చి, కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

సౌదీ అరేబియాపై తమ దాడులను హూతీలు పూర్తిగా నిలిపివేస్తే వారికి 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు) చెల్లించేందుకు సౌదీ అంగీకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఇరాన్ ద్వారానే హూతీలకు అందించే అవకాశం ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఒప్పందం కోసం సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఇటీవల టెహ్రాన్ పర్యటనకు వెళ్లగా.. ఆయన వచ్చిన సైనిక రవాణా విమానంలోనే ఒప్పందానికి సంబంధించిన నిధులను తరలించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై సౌదీ అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇరాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ శాంతి చర్చల్లో తుర్కియే ఇంటెలిజెన్స్ చీఫ్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మరియు ఇస్లామిక్ విప్లవాత్మక గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

గతంలో యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా హూతీలకు వ్యతిరేకంగా సౌదీ రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య పోరు తీవ్రమైంది. ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ దాడులు, గల్ఫ్ చమురు ఎగుమతులకు అంతరాయం కలగడంతో సౌదీ అరేబియా ఈ చారిత్రక రాజీ బాటను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.