Rohingya Refugees : శరణార్థుల నుంచి పౌరులుగా.. 22 వేల మంది రోహింగ్యాలకు విముక్తి ప్రసాదించిన సౌదీ అరేబియా

Rohingya Refugees : సౌదీ అరేబియా ఒత్తిడికి బంగ్లాదేశ్ తలొగ్గింది. 22 వేల మంది రోహింగ్యా శరణార్థులకు బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు జారీ చేయడంతో వారు ఇప్పుడు అధికారిక పౌరులుగా మారారు.

CR Reddy
Published on: 22 April 2026 9:08 AM IST
Rohingya Refugees
X

Rohingya Refugees

Rohingya Refugees : మయన్మార్ అంతర్గత కల్లోలంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రోహింగ్యా శరణార్థుల పాలిట సౌదీ అరేబియా దేవుడిగా మారింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వేసిన ఎత్తుగడ, పెట్టిన ఒత్తిడికి బంగ్లాదేశ్ తలొగ్గింది. ఫలితంగా, సౌదీలో నివసిస్తున్న 22 వేల మంది రోహింగ్యా శరణార్థులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. దీనివల్ల ఆ శరణార్థులందరూ ఇప్పుడు అధికారికంగా బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తింపు పొందారు. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.

ఏం జరిగింది? సౌదీ ఎందుకు ఒత్తిడి పెట్టింది?

మయన్మార్ నుంచి ప్రాణభయంతో పారిపోయిన లక్షలాది మంది రోహింగ్యాలలో చాలామంది బంగ్లాదేశ్ మీదుగా సౌదీ అరేబియాకు వలస వెళ్లారు. ప్రస్తుతం సౌదీలో సుమారు లక్ష మంది రోహింగ్యాలు ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా నివసిస్తున్నారు. వీరిని పర్యవేక్షించడం సౌదీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తమ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దేశపు గుర్తింపు కార్డు ఉండాలని సౌదీ పట్టుబట్టింది. అందుకే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారందరికీ బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు ఇవ్వాలని ఆ దేశంపై ఒత్తిడి తెచ్చింది. తాజాగా 22 వేల మందికి పాస్‌పోర్ట్‌లు రాగా, మిగిలిన 69 వేల మందికి కూడా వెంటనే ఏర్పాట్లు చేయాలని సౌదీ రాయబారి డిమాండ్ చేస్తున్నారు.

సౌదీ అరేబియా తెలివైన స్కెచ్ - విజన్ 2030

సౌదీ అరేబియా ప్రస్తుతం విజన్ 2030 పై పని చేస్తోంది. దీని కింద దేశంలోని ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తూ, అక్రమంగా నివసించే వారిని ఏరివేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ రోహింగ్యాలను పంపించాల్సి వస్తే, వారికి ఏదో ఒక దేశపు పౌరసత్వం ఉండాలి. పాస్‌పోర్ట్ లేకపోతే బంగ్లాదేశ్ వారిని తీసుకోదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా సౌదీ ప్రభుత్వం ఈ ప్లాన్ వేసింది. పత్రాలు ఉంటే వారిని ట్రేస్ చేయడం సులభం కావడమే కాకుండా, వారు సౌదీలో చట్టబద్ధంగా పని చేసుకోవడానికి కూడా వీలవుతుంది.

బంగ్లాదేశ్ ఎందుకు ఒప్పుకుంది?

బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద ఆర్థిక కారణాలే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే 10 లక్షల మంది రోహింగ్యాలు శరణార్థులుగా ఉన్నారు. ఇప్పుడు సౌదీ నుంచి వారు వెనక్కి వస్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాగే, సౌదీ అరేబియా బంగ్లాదేశ్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని గతంలో హామీ ఇచ్చింది. సౌదీలో సుమారు 3.5 లక్షల మంది బంగ్లాదేశ్ కార్మికులు పని చేస్తున్నారు. ఒకవేళ సౌదీ మాట వినకపోతే ఈ పెట్టుబడులు ఆగిపోవడమే కాకుండా, కార్మికుల పంపకంపై సౌదీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే రిస్క్ తీసుకోలేక బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం

సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశాల్లో అత్యంత శక్తివంతమైన దేశం కావడంతో, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు దాని మాటను కాదనలేవు. గతంలో కూడా పాకిస్థాన్ వంటి దేశాలు సౌదీ ఒత్తిడికి లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రోహింగ్యాల విషయంలో కూడా అదే జరిగింది. బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వారికి పాస్‌పోర్ట్‌లు ఇస్తున్నామని ప్రకటించారు. దీనివల్ల రోహింగ్యాల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరికినట్లు కనిపిస్తున్నా, బంగ్లాదేశ్‌పై ఇది దీర్ఘకాలికంగా భారం వేసే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story