Secret Israeli Airbase in Iraq: ఇరాక్‌లో ఇజ్రాయిల్‌ ఎయిర్‌బేస్‌...ఇరాన్‌పై దాడి ఇక్కడినుంచే జరిగిందా?

ఇరాన్-అమెరికా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాక్ దేశంలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ఇజ్రాయెల్ ఒక రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించిందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

Balachander
Published on: 13 May 2026 12:33 PM IST
Secret Israeli Airbase in Iraq:  ఇరాక్‌లో ఇజ్రాయిల్‌ ఎయిర్‌బేస్‌...ఇరాన్‌పై దాడి ఇక్కడినుంచే జరిగిందా?
X

Secret Israeli Airbase in Iraq: ఇరాన్-అమెరికా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాక్ దేశంలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ఇజ్రాయెల్ ఒక రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించిందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మీడియాలో ఈ కథనాలు వెలువడటంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడులకు ఈ స్థావరాన్ని వినియోగించారనే వార్తలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి.

అమెరికా మీడియా సంచలన కథనం

ఇటీవల వెలువడిన అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించడానికి వీలుగా ఇజ్రాయెల్, ఇరాక్ ఎడారిలో ఒక రహస్య అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్థావరం కేవలం నిఘాకే పరిమితం కాకుండా, ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలకు నివాసంగా, అలాగే యుద్ధ విమానాలకు అవసరమైన ఇంధనం, ఆయుధాలను సరఫరా చేసే లాజిస్టికల్ హబ్‌గా పనిచేసిందని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అమెరికాకు తెలిసే జరిగిందని ఈ కథనాల సారాంశం. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇరాక్‌పై అమెరికా ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో ఇజ్రాయిల్‌కు వరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

ఇరాక్ ఖండన - అసలు నిజమేంటి?

అయితే, ఈ వార్తలపై ఇరాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. టర్కీకి చెందిన 'అనడోలు' వార్తా సంస్థతో మాట్లాడిన ఇరాక్ ఉన్నతాధికారి ఒకరు, తమ దేశంలో ఇజ్రాయెల్ ఎలాంటి సైనిక స్థావరాన్ని నిర్మించలేదని స్పష్టం చేశారు. "ఇరాక్ భూభాగంలో ఇజ్రాయెల్ రహస్య స్థావరం ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ భద్రతా అధికారి కొట్టిపారేశారు. కానీ, అమెరికా మీడియా వీడియోతో సహా వీటిని ప్రసారం చేయడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అసలే ఇరాన్‌ ఇరాక్‌ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా కుర్ధులు పోరాటం చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడి తరువాత ఈ కుర్ధులు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం విశేషం.

యుద్ధ వ్యూహం - భౌగోళిక ప్రాధాన్యత

ఇరాన్ మీద దాడి చేయాలంటే ఇరాక్ భూభాగం ఇజ్రాయెల్‌కు ఎంతో కీలకం. దూరం తగ్గడమే కాకుండా, రాడార్ల కళ్లుగప్పి దాడి చేయడానికి ఇరాక్ ఎడారులు అనువుగా ఉంటాయి. వేగంగా, ఖచ్చితంగా దాడులు చేయాలంటే ఇవే కీలకం. ఇరాక్‌లో ఈ రహస్య స్థావరం నిజమైతే... అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది. తాము ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని చెప్పేందుకు ఇరాక్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇరాన్‌ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అమెరికా కనుసన్నల్లో ఉన్న ఇరాక్‌లో ఇజ్రాయిల్‌ రహస్యస్థావరాన్ని నిర్మించుకున్న మాట నిజమైతే ఇరాక్‌పై ఇరాన్‌ దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరాక్‌ గడ్డపై నుంచి దాడి జరిగినట్టుగా ఇరాన్‌ భావించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ రహస్య స్థావరం గురించి పొంతన లేని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు అమెరికా మీడియా ఆధారాలతో సహా చెబుతుంటే, మరోవైపు ఇరాక్ రక్షణ శాఖ దీనిని తోసిపుచ్చుతోంది. ఇరాన్‌పై జరిగిన దాడుల వెనుక ఈ స్థావరం పాత్ర ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, మధ్య ప్రాచ్యంలో మారుతున్న ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి సవాలుగా మారాయి. అసలే హోర్ముజ్‌ మూసివేతతో చమురుకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే..ఇప్పుడు ఈ వార్త మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story