Donald Trump : పార్టీలో కలకలం.. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు తృటిలో తప్పిన ప్రాణాపాయం

Donald Trump :వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో జర్నలిస్టుల కోసం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వార్షిక విందు కార్యక్రమం జరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

CR Reddy
Published on: 26 April 2026 7:40 AM IST
Donald Trump
X

Donald Trump 

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి మృత్యువు పలకరించిందా? అంటే అవుననే అంటున్నాయి వాషింగ్టన్ వర్గాలు. వాషింగ్టన్‌లోని ప్రముఖ హోటల్ హిల్టన్‌లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో ఒక్కసారిగా తూటాలు పేలడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్ లోపల అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వెన్స్ ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే, భద్రతా బలగాలు అప్రమత్తమై వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

అసలేం జరిగింది?

వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో జర్నలిస్టుల కోసం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వార్షిక విందు కార్యక్రమం జరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో, ఒక్కసారిగా హోటల్ ప్రాంగణంలో తుపాకీ శబ్దాలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.

ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్

కాల్పుల ఘటన జరిగిన కాసేపటికే అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‎లో స్పందించారు. "నేను సురక్షితంగా ఉన్నాను. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అద్భుతమైన పనితీరు కనబరిచారు. దుండగుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమం వాయిదా పడింది, మళ్ళీ 30 రోజుల్లోగా దీనిని నిర్వహిస్తాం" అని పోస్ట్ చేశారు. కాల్పుల అనంతరం ట్రంప్‌ను, వాన్స్‌ను ప్రత్యేక వాహనాల్లో వైట్ హౌస్‌కు తరలించారు.

భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు

అధ్యక్షుడు ఉండే చోట అత్యంత కఠినమైన భద్రత ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి తుపాకీతో లోపలికి ఎలా రాగలిగాడు? ఇది ముమ్మాటికీ భద్రతా లోపమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని వెనకేసుకొచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు అతని లక్ష్యం ట్రంప్ లేక అక్కడ ఉన్న జర్నలిస్టులా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

గతంలోనూ దాడుల ప్రయత్నం

డొనాల్డ్ ట్రంప్‌పై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల ప్రచార సమయంలోనూ పెన్సిల్వేనియాలో ఆయనపై కాల్పులు జరిగాయి. అప్పుడు ఆయన చెవిని తూటా తాకుతూ వెళ్ళింది. తాజా ఘటనతో అమెరికాలో గన్ కల్చర్, అధ్యక్షుడి భద్రతపై మళ్ళీ చర్చ మొదలైంది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story