US Storm: అమెరికాను వణికించిన భారీ తుపాను.. 9 లక్షల ఇళ్లకు కరెంట్ కట్

అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుపాను వణికించింది. బలమైన గాలులు, వర్షాలు, వరదలతో దాదాపు 9 లక్షల విద్యుత్ వినియోగదారులకు సరఫరా నిలిచిపోయింది.

CR Reddy
Published on: 27 Nov 2026 9:01 AM IST
US Storm
X

US Storm

US Storm: అమెరికాలో థాంక్స్‌గివింగ్ వేడుకల సమయంలో ప్రకృతి ప్రకోపం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దేశ తూర్పు తీర ప్రాంతాలపై విరుచుకుపడిన శక్తివంతమైన తుపాను కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రపు అలల ఉద్ధృతి కనిపించాయి. పలుచోట్ల రోడ్లు నీట మునిగాయి. చెట్లు నేలకొరిగి ఇళ్లపై, విద్యుత్ లైన్లపై పడటంతో పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం సాయంత్రానికి దాదాపు 9 లక్షల మంది వినియోగదారులు కరెంట్ లేక ఇబ్బందులు పడ్డారు. విమాన ప్రయాణాలపైనా తుపాను తీవ్ర ప్రభావం చూపింది.

440 విమానాలు రద్దు

తుపాను ప్రభావంతో అమెరికాలో విమాన రాకపోకలు గందరగోళంగా మారాయి. గురువారం నాటికి 440కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 2,200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా న్యూయార్క్, వాషింగ్టన్ పరిసర విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు 110 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో విమాన సర్వీసుల నిర్వహణ కష్టంగా మారింది. థాంక్స్‌గివింగ్ సెలవుల కోసం సొంతూళ్లకు, విహారయాత్రలకు వెళ్లాలనుకున్నవారి ప్రణాళికలు దెబ్బతిన్నాయి.

100 ఏళ్ల చరిత్రలో తొలిసారి

న్యూయార్క్‌లో ఏటా నిర్వహించే ప్రసిద్ధ మేసీ థాంక్స్‌గివింగ్ డే పరేడ్‌పై కూడా తుపాను ప్రభావం పడింది. ఈ ఏడాది ఈ వేడుక వందోసారి జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరికల నేపథ్యంలో నిర్వాహకులు, నగర అధికారులు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి కార్యక్రమాన్ని నవంబర్ 28 శనివారానికి వాయిదా వేశారు. ఈ పరేడ్‌లో భారీ ఆకారాల్లో ఉండే గాలిబుడగలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే అవి అదుపు తప్పి ప్రేక్షకులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పరేడ్ చరిత్రలో వాతావరణం కారణంగా వాయిదా పడటం ఇదే తొలిసారి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 నుంచి 1944 వరకు మాత్రం యుద్ధ అవసరాల కారణంగా ఈ వేడుకను రద్దు చేశారు.

9 లక్షల మందికి కరెంట్ కట్

పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం ఎక్కువగా కనిపించింది. తడిసిన నేలపై బలమైన గాలులు వీయడంతో చెట్లు కూలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మేరీల్యాండ్‌లోని మాంట్‌గోమరీ, ప్రిన్స్ జార్జ్ కౌంటీల్లో విద్యుత్ సరఫరా సమస్యల కారణంగా నీటి సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు కుళాయి నీటి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా కొన్ని ప్రధాన వంతెనలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.

న్యూజెర్సీలో ఎమర్జెన్సీ

తుపాను ముప్పును ముందుగానే గుర్తించిన న్యూజెర్సీ గవర్నర్ మికీ షెరిల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే ఛార్జ్ చేసుకోవాలని, విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వరద నీటితో నిండిన రోడ్లపై ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కాలిఫోర్నియాలోనూ ఈ వారం భారీ వర్షాలు, సముద్రంలో ఎత్తైన అలల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో కూడా వర్షాలు కురిశాయి. మొత్తంగా థాంక్స్‌గివింగ్ సెలవుల వేళ అమెరికాలోని పలు ప్రాంతాల్లో తుపాను ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.