ఉగ్రవాదికి 'అమరవీరుడి' పట్టం.. పాక్ ప్రధాని షాబాజ్ సంతాప నాటకం
Shehbaz Sharif: ప్రపంచం ముందు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం కాదంటూ ఎప్పుడూ పాఠాలు చెప్పే పాకిస్థాన్.. మరోసారి తన అసలు రంగు బయటపెట్టుకుంది.
ఉగ్రవాదికి 'అమరవీరుడి' పట్టం.. పాక్ ప్రధాని షాబాజ్ సంతాప నాటకం
Shehbaz Sharif: ప్రపంచం ముందు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం కాదంటూ ఎప్పుడూ పాఠాలు చెప్పే పాకిస్థాన్.. మరోసారి తన అసలు రంగు బయటపెట్టుకుంది. కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా దళాల కాల్పుల్లో హతమైన లష్కర్-ఎ-తైబా, టీఆర్ఎఫ్ ఉగ్రవాద కమాండర్ లతీఫ్ అహ్మద్ భట్‌ను పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఏకంగా 'అమరవీరుడు' అని కీర్తిస్తూ సంతాపం తెలిపారు. తుపాకీ పట్టుకుని దాక్కున్న ఉగ్రవాదికి షరీఫ్ నివాళులర్పించడం చూస్తుంటే.. ఉగ్రవాదుల విషయంలో ఇస్లామాబాద్ ప్రేమ ఎంత లోతుగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
మసీదులో దాక్కుంటే.. వీడియో కాల్స్‌లో బుజ్జగింపు
నవంబర్ 18న దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జంగల్పోరా గ్రామంలో భద్రతా దళాలు పక్కా సమాచారంతో చుట్టుముట్టాయి. ఆపరేషన్ మొదలవగానే భట్ ఒక మసీదులో దాక్కున్నట్లు తెలిసింది. మన బలగాలు ఎంతో సంయమనంతో, వీడియో కాల్స్ చేస్తూ మరీ లొంగిపోవాలని ఒప్పించేందుకు ప్రయత్నించాయి. కానీ ఆ మహానుభావుడు లొంగేదే లేదంటూ కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఇలాంటి 'వీరోచిత' ఘట్టాన్ని చూసిన తర్వాత పాక్ ప్రధానికి కన్నీళ్లు ఆగకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?
నైతిక మద్దతట.. ఎప్పటి నుంచో ఇదే కహానీ
ఉగ్రవాది మరణంపై సంతాపం చెబుతూనే, జైళ్లలో ఉన్న కొందరు కాశ్మీరీ నేతల గురించి కూడా షాబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాల పేరు చెబుతూ కశ్మీరీలకు తాము ఎప్పటికీ నైతిక, దౌత్యపరమైన మద్దతు ఇస్తామని ప్రకటించారు. సొంత దేశంలో ఆర్థిక కష్టాలతో తలమునకలై ఉన్నా, పక్క దేశంలో ఉగ్రవాదులకు 'నైతిక మద్దతు' ఇవ్వడంలో మాత్రం పాకిస్థాన్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. లతీఫ్ భట్ మృతిపై షరీఫ్ మాటలు వింటే, ఉగ్రవాదానికి అధికారిక ముద్ర వేయడం ఇస్లామాబాద్‌కు కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది.




