Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయంలో సరికొత్త ట్విస్ట్.. మళ్లీ డిసెంబర్‌లోనే ఎందుకు షేక్ హసీనా రీ-ఎంట్రీ?

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 2026లో భారత్ నుంచి స్వదేశానికి తిరిగెళ్తానని ప్రకటించారు.

CR Reddy
Published on: 7 Aug 2026 6:55 AM IST
Sheikh Hasina
X

Sheikh Hasina

Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 2026లో తాను భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్ వెళ్లి, అక్కడ కోర్టు ముందు లొంగిపోతానని వెల్లడించారు. తనకు మరణం అంటే ఎలాంటి భయం లేదని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) నవంబర్ 2025లోనే ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమాల సమయంలో దాదాపు 1,400 మంది మరణానికి కారణమయ్యారనే ఆరోపణలతో పాటు, ఆమెపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆమె డిసెంబర్ నెలనే తన రీఎంట్రీ ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది.

1971 - బంగ్లాదేశ్ స్వాతంత్ర్య విజయం

డిసెంబర్ నెల బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత కీలకమైనది. 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడంతో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ముగిసింది. ఈ రోజును ఇప్పటికీ అక్కడ విజయ దివస్‎గా జరుపుకుంటారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో షేక్ హసీనా తండ్రి, జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చారిత్రక నేపథ్యం వల్ల డిసెంబర్ నెల ఆమె కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది.

1990 - ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం

1990 డిసెంబర్ మాసంలో బంగ్లాదేశ్‌లో సైనిక పాలకుడు హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ ప్రజా ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆ సంఘటన ద్వారా బంగ్లాదేశ్‌లో మళ్లీ ప్రజాస్వామ్యం పురుడుపోసుకుంది.

2008 - అధికారాన్ని దక్కించుకున్న చారిత్రక ఘట్టం

ఆ తర్వాత డిసెంబర్ 2008లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీని ద్వారా ఆమె మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద మలుపుగా నిలిచింది. ఈ విధంగా స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అధికారంలోకి రావడం.. ఇలా అన్ని ప్రధాన ఘట్టాలు డిసెంబర్ నెలలోనే జరగడంతో, ఆ నెలను ఆమె తనకు, తన పార్టీకి అత్యంత కలసివచ్చే మాసంగా భావిస్తారు.

చారిత్రక ప్రాధాన్యతతోనే డిసెంబర్ ఎంపిక

తలమీద మరణశిక్ష వేలాడుతున్నప్పటికీ 150కి పైగా కేసులు నమోదైనప్పటికీ.. సింబాలిక్‌గా డిసెంబర్ నెలనే తన తిరుగు ప్రయాణానికి ఎంచుకోవడం వెనుక ఈ చారిత్రక ప్రాధాన్యతే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పరిస్థితులను బట్టి తేదీల్లో మార్పులు ఉండవచ్చని కూడా హసీనా స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story