Sheikh Hasina: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా.. విమానం పంపాలని విజ్ఞప్తి!

Sheikh Hasina: భారత్‌లో రెండేళ్లుగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న విక్టరీ డే రోజున స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2026 12:02 PM IST
Sheikh Hasina
X

Sheikh Hasina: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా.. విమానం పంపాలని విజ్ఞప్తి!

Sheikh Hasina: గత రెండేళ్లకు పైగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల డిసెంబర్ 16న తాను తిరిగి స్వదేశానికి (బంగ్లాదేశ్‌కు) వెళ్లనున్నట్లు ఆమె ప్రకటించారు. ఏటా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లో ‘విక్టరీ డే’ (విజయ దినోత్సవం) నిర్వహిస్తారు. సరిగ్గా అదే చారిత్రాత్మక రోజును ఆమె తన పునరాగమనానికి ఎంచుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

2024 ఆగస్టు 5న జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి తనను ఢిల్లీ నుంచి గౌరవంగా స్వదేశానికి తీసుకువెళ్లేందుకు ‘బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్’ ప్రత్యేక విమానాన్ని పంపాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. "ఆ సమయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమెను బహిష్కరించినందున, డిసెంబర్ 16 విక్టరీ డే రోజున హసీనా గౌరవప్రదంగా దేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది" అని హసీనా సహాయకుడు ఒకరు వెల్లడించారు.

స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు షేక్ హసీనా కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్ అధికారులను అభ్యర్థించారు. మరోవైపు, హసీనాను తిరిగి పంపాలంటే బంగ్లాదేశ్ తమ సైనిక విమానాన్ని పంపాలని లేదా ఇరు దేశాల భూ సరిహద్దు వద్ద పొరుగు దేశ సైన్యం ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలకాలని భారత్ షరతులు విధించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా తేదీని ఖరారు చేయడం చర్చనీయాంశమైంది.

షేక్ హసీనా ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఒకవేళ హసీనా తిరిగి దేశంలో అడుగుపెడితే ఆమెను కచ్చితంగా అరెస్ట్ చేస్తామని బంగ్లా ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, ఆమెను తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని పంపే విషయంపై భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని ఆ వర్గాలు తేల్చిచెప్పాయి. దీంతో డిసెంబర్ 16న ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.