Sheikh Hasina: చావడానికైనా సిద్ధమే.. ఈ డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్తా

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 10 July 2026 3:33 PM IST
Sheikh Hasina
X

Sheikh Hasina: చావడానికైనా సిద్ధమే.. ఈ డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్తా

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా అంతర్జాతీయ వేదికపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే స్వదేశానికి వెళ్లి అక్కడ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని, అరెస్టు కావడానికి లేదా చావడానికైనా తాను సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు.

తన తాజా నిర్ణయంపై షేక్ హసీనా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. "నేను స్వదేశానికి వెళ్లిన తర్వాత వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు లేదా చంపేయవచ్చు. అయినా సరే నేను వెళ్లాల్సిందే. బంగ్లాదేశ్‌లో నా అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఒకవేళ నాకు మరణం సంభవిస్తే.. నా తల్లిదండ్రులను ఖననం చేసిన నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నా" అని హసీనా పేర్కొన్నారు. ఈ డిసెంబర్‌లో తనతో పాటు అవామీ లీగ్‌ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు బంగ్లాదేశ్‌కు వెళ్లి కోర్టుల్లో లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై ప్రస్తుత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో, గతేడాది ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, నాటి నిరసనలను అణచివేయడంలో వందలాది మంది మరణానికి హసీనానే కారణమంటూ బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరిపి, 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది.

తాజాగా హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ అధికారులు భారత ప్రభుత్వానికి వరుస లేఖలు రాస్తున్నారు. ఈ దౌత్యపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలోనే భారత్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆమె స్వయంగా డిసెంబర్‌లో బంగ్లాదేశ్ వెళ్లేందుకు కచ్చితమైన సమయాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అటు భారత్, ఇటు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందోనని అంతర్జాతీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story