Hypersonic Weapon: కిమ్ సహనాన్ని పరీక్షిస్తున్న సౌత్ కొరియా... సూపర్ సోనిక్‌తో హెచ్చరిక
ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ దక్షిణ కొరియా తొలిసారి స్వదేశీ హైపర్‌సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. శబ్ద వేగం కంటే 5 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈ ఆయుధం ప్రత్యేకత, పరీక్ష వివరాలు తెలుసుకుందాం.
Hypersonic Weapon: ఉత్తర కొరియా వరుసగా క్షిపణి సామర్థ్యాలను పెంచుకుంటున్న వేళ.. దక్షిణ కొరియా కూడా కీలకమైన అడుగు వేసింది. స్వదేశంలోనే అభివృద్ధి చేసిన తొలి హైపర్‌సోనిక్ ఆయుధాన్ని దక్షిణ కొరియా అక్టోబర్ 8న విజయవంతంగా పరీక్షించింది. శబ్ద వేగం కంటే కనీసం 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే ఈ ఆయుధం.. గాల్లోనే తన దిశను మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించారు. సాధారణ క్షిపణులతో పోలిస్తే హైపర్‌సోనిక్ ఆయుధాలను గుర్తించడం, వాటిని అడ్డుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ పరీక్షను సియోల్ రక్షణ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తోంది.
గాల్లో దిశ మార్చుకుని.. లక్ష్యాన్ని ఛేదించింది
దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయోగించిన హైపర్‌సోనిక్ ఆయుధం నిర్ణయించిన ఎత్తుకు చేరుకున్న తర్వాత బూస్టర్ నుంచి విడిపోయింది. అనంతరం కిందికి దూసుకొస్తూ ముందుగా నిలువు దిశలో, ఆ తర్వాత అడ్డంగా తన మార్గాన్ని మార్చుకుంది. చివరికి నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా తాకింది. అయితే ఈ పరీక్షను ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించలేదు. ఈ ఆయుధం పూర్తిస్థాయిలో సైన్యంలోకి చేరిన తర్వాత.. కొరియా ద్వీపకల్పంలోని కీలక లక్ష్యాలపై అనూహ్య దాడులు చేసే సామర్థ్యం దక్షిణ కొరియాకు లభిస్తుందని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
సొంత శక్తితోనే భద్రత - లీ
పరీక్షను పరిశీలించిన అధ్యక్షుడు లీ జే మియంగ్.. దక్షిణ కొరియా తన భద్రతను సొంత రక్షణ సామర్థ్యాలపై ఆధారపడి మరింత బలోపేతం చేసుకోవాలని స్పష్టం చేశారు. అదే పర్యటనలో దక్షిణ కొరియా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన హ్యున్మూ-5 బాలిస్టిక్ క్షిపణిని కూడా ఆయన పరిశీలించారు. దీంతో సియోల్ ఇప్పుడు కేవలం రక్షణాత్మక ఆయుధాలపైనే కాకుండా.. అవసరమైతే శత్రు క్షిపణి వ్యవస్థలను దాటుకుని కీలక లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలపై కూడా దృష్టి పెడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర కొరియా కూడా వెనక్కి తగ్గడం లేదు
దక్షిణ కొరియా హైపర్‌సోనిక్ ఆయుధ పరీక్షకు కొన్ని రోజుల ముందే ఉత్తర కొరియా కూడా తన సొంత హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అక్టోబర్ 3న నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జపాన్ సమీప సముద్ర జలాల్లో పడినట్లు ప్యాంగ్యాంగ్ ప్రకటించింది. అయితే దక్షిణ కొరియా అంచనా ప్రకారం ఆ క్షిపణి 700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. జపాన్ అంచనా మాత్రం సుమారు 680 కిలోమీటర్లు. మూడు దేశాల అంచనాల్లో తేడాలు రావడాన్ని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తన వాదనలకు ఉపయోగించుకున్నారు. అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్.. ఇలాంటి ఆయుధాలను సరిగ్గా గుర్తించడం, అడ్డుకోవడం కష్టమని ఆమె వ్యాఖ్యానించారు.
సరిహద్దులోనూ పెరుగుతున్న ఉద్రిక్తత
క్షిపణి పరీక్షలతో పాటు రెండు కొరియాల మధ్య సరిహద్దు పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అంతర్-కొరియా సరిహద్దు సమీపంలో మందుపాతరల కారణంగా ముగ్గురు దక్షిణ కొరియా సైనికులు గాయపడ్డారు. ఈ మందుపాతరలను ఉత్తర కొరియానే అమర్చిందని దక్షిణ కొరియా, అమెరికా నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి కమాండ్ ఆరోపించగా.. ప్యాంగ్యాంగ్ ఆ ఆరోపణలను తిరస్కరించింది. ఇదే సమయంలో కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నారు. అమెరికా మాత్రం నిలిచిపోయిన దౌత్య చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది. కానీ ప్యాంగ్యాంగ్ నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన కనిపించడం లేదు. మొత్తంగా చూసుకుంటే.. ఒకవైపు ఉత్తర కొరియా అణు, హైపర్‌సోనిక్ క్షిపణి సామర్థ్యాలను పెంచుకుంటుంటే.. మరోవైపు దక్షిణ కొరియా కూడా అత్యాధునిక సంప్రదాయ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా 5 రెట్లకు పైగా శబ్ద వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ ఆయుధం పరీక్ష విజయవంతం కావడం.. కొరియా ద్వీపకల్పంలో ఆయుధ పోటీ మరింత కొత్త దశలోకి వెళ్తోందనే సంకేతంగా మారింది.




