South Sudan Health Crisis: సౌత్‌ సూడాన్‌లో వైద్యసంక్షోభం... ప్రమాదంలో 3 లక్షలమంది ప్రాణాలు

సౌత్‌ సూడాన్‌లో యుద్ధం, ఆసుపత్రుల ధ్వంసంతో 3 లక్షల మందికి పైగా ప్రజలు వైద్యసేవలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Balachander
Published on: 27 May 2026 2:30 PM IST
South Sudan Health Crisis: సౌత్‌ సూడాన్‌లో వైద్యసంక్షోభం... ప్రమాదంలో 3 లక్షలమంది ప్రాణాలు
X

South Sudan Health Crisis: ప్రపంచంలోనే యంగెస్ట్‌ కంట్రీ ‘సౌత్ సూడాన్’ ఇప్పుడు రక్తసిక్తమై ఘోరమైన వైద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్యుద్ధం కోరల్లో చిక్కుకున్న ఈ దేశంలో, కేవలం ఉత్తర జొంగ్లే రాష్ట్రంలోనే 300,000 కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవుల్లోకి, చిత్తడి నేలల్లోకి పారిపోయారు. అంతర్జాతీయ వైద్య సహాయక సంస్థ ‘మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’కు చెందిన లంకీన్ ఆసుపత్రిపై జరిగిన ఘోరమైన బాంబు దాడితో సుమారు 250,000 మందికి ఏకైక ఆధారంగా ఉన్న ద్వితీయ శ్రేణి వైద్య సేవలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఈ దాడిలో ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెడుతున్న ఒక ఎమ్‌ఎస్‌ఎఫ్ నర్సు సైతం బుల్లెట్ గాయంతో అక్కడికక్కడే మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్వతంత్య్రం సంపాదించుకొని కేవలం దశాబ్దకాలం మాత్రమే అయిన ఈ సౌత్‌ సూడాన్‌లో ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తెలుసుకుందాం.

బాంబు దాడుల బీభత్సం

సౌత్ సూడాన్‌లో సరికొత్త వ్యూహాత్మక యుద్ధం మొదలైంది. 2024లో కేవలం రెండు వైమానిక దాడులు మాత్రమే నమోదు కాగా, 2025లో ఏకంగా 138 వైమానిక దాడులు జరిగాయి. అలాగే 2026 మొదటి మూడు నెలల్లోనే మరో 18 దాడులు జరిగాయి. ప్రభుత్వ బలగాలు, వాటి మిత్రపక్షమైన ఉగాండా సైన్యం మాత్రమే ఇక్కడ వైమానిక శక్తిని ఉపయోగిస్తున్నాయి. ఈ భీకరమైన దాడుల కారణంగా లంకీన్‌, అకోబో, ఓల్డ్‌ ఫాంగాక్‌, ఉలాంగ్‌ నగరాల్లోని ప్రధాన ఆసుపత్రులు మూతపడ్డాయి. ఇలా ఆసుపత్రులు మూతపడటంతో సుమారు 7.6 లక్షల మంది రోగులకు అత్యవసర చికిత్స అందకుండా పోయింది. దీంతో వీరికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక 2026లో జరిగిన దాడుల్లో సుమారు 6,096 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 18 శాతం మంది మహిళలు, 13 శాతం వరకు 15 ఏళ్లలోపున్న చిన్నారులు ఉన్నారు.

అనుమతుల నిరాకరణ... మానవతా సంక్షోభం

సౌత్‌ సూడాన్‌ మ్యాప్‌ను పరిశీలిస్తే.. అక్కడికి చేరుకోవడానికి సరైన రహదాలు లేవని అర్ధమౌతున్నది. ఇక్కడ రోడ్డు మార్గాలు సరిగా ఉండవు. ఉన్నా ఎగుడుదిగుడుగా... ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లోనే కాదు... సాధారణ పరిస్థితుల్లో కూడా మందులు తరలించాలంటే చిన్న తరహా విమానాలు వాడాల్సిందే. ఈ దేశంలో అధికార, విపక్షాల మధ్యనే వార్‌ జరుగుతున్నది. ఈ పొలిటికల్‌ సివిల్‌ వార్‌ కారణంగా అధికారులు విపక్షాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేశారు. దీంతో సరైన మందులు లేక, అవసరానికి ఉపయోగపడే పోషకాహారం లేక చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

చికిత్స అందిస్తే నయమయ్యే జబ్బులకు కూడా మందులు లేకపోవడంతో వందలాది మంది మరణించారు. మందుల సంక్షోభంతో పాటు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్టుగా వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నివేదికలను విడుదల చేసింది. ఈ దేశంలో 70 శాతం మంది జనాభా తీవ్రమై ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 2011లో స్వాతంత్య్రం పొందిన ఈ దేశం, నేడు రాజకీయ ఆధిపత్యం, జాతి వివక్షతో కూడిన అంతర్యుద్ధంలో నలిగిపోతోంది. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి సైనిక దాడులను అరికట్టకపోతే, అక్కడ వైద్యం అందక లక్షలాది మంది సామాన్య ప్రజలు సమాధులవ్వడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story