Workers Strike: ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. రోడ్డెక్కిన 40 లక్షల మంది ఉద్యోగులు

Workers Strike: స్పెయిన్‌లో ఇళ్ల కొరత, పెరుగుతున్న అద్దెలు, నిత్యావసరాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు.

CR Reddy
Published on: 12 Nov 2026 10:23 AM IST
Workers Strike: ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. రోడ్డెక్కిన 40 లక్షల మంది ఉద్యోగులు
X

Workers Strike: స్పెయిన్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని ఇళ్ల సమస్యపై ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు దేశవ్యాప్త సమ్మెకు దారితీశాయి. సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. మరోవైపు బార్సిలోనాలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో దుకాణాలపై దాడులు, నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

14 ఏళ్ల తర్వాత దేశవ్యాప్త సమ్మె

స్పెయిన్‌లోని రెండు ప్రధాన కార్మిక సంఘాలు UGT, CCOO ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. వాటి అంచనా ప్రకారం సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు పనులు నిలిపివేశారు. ఇది దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు ఐదో వంతుకు సమానం. మాడ్రిడ్, బార్సిలోనా సహా పలు నగరాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. 14 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన తొలి సమ్మె కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బార్సిలోనాలో ర్యాలీకి సుమారు 4 లక్షల మంది హాజరైనట్లు నిర్వాహకులు చెబితే, స్థానిక అధికారులు మాత్రం 55 వేల మంది పాల్గొన్నట్లు అంచనా వేశారు.

బార్సిలోనాలో నిప్పంటించిన ఆందోళనకారులు

ప్రారంభంలో నిరసనలు ప్రశాంతంగానే సాగాయి. అయితే ప్రధాన ర్యాలీ ముగిసిన తర్వాత కొందరు ముసుగు ధరించిన వ్యక్తులు విధ్వంసానికి దిగారు. రోడ్లపై ఉన్న చెత్తకుండీలు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దుకాణాల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై బాణసంచా విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బలప్రయోగం చేశారు. బార్సిలోనా మేయర్ జైమ్ కొల్బోనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనల్లో సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 దుకాణాలు దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖకు చెందిన సుమారు 100 మంది సిబ్బంది పనిచేశారు.

దేశవ్యాప్తంగా 73 మంది అరెస్ట్

బార్సిలోనాతో పాటు మాడ్రిడ్‌లోనూ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రే, ఫోమ్ గుళ్లను ప్రయోగించినట్లు కథనంలో పేర్కొన్నారు. సమ్మెకు సంబంధించిన వివిధ ఘటనల్లో రాత్రి సమయానికి దేశవ్యాప్తంగా కనీసం 73 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.

యువత సంపాదనలో 98.7 శాతం అద్దెకే

స్పెయిన్‌లో ఇళ్ల కొరత, పెరుగుతున్న అద్దెలు ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా మారాయి. దేశంలో ప్రస్తుతం సుమారు 7.5 లక్షల ఇళ్ల కొరత ఉందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే 2028 నాటికి ఈ లోటు 10 లక్షలు దాటవచ్చని అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు ఒక ఇంటి సగటు నెలవారీ అద్దె 1,176 యూరోలుగా ఉంది. ఇది యువత సగటు నెలవారీ ఆదాయంలో దాదాపు 98.7 శాతానికి సమానం. అంటే యువత సంపాదనలో దాదాపు మొత్తం ఇంటి అద్దెకే ఖర్చవుతోంది. దీంతో ఇతర అవసరాలకు డబ్బు మిగలని పరిస్థితి నెలకొంది.

ఎన్నికల ముందు కీలకంగా మారిన ఇళ్ల సమస్య

స్పెయిన్‌లో నవంబర్ 29న సాధారణ ఎన్నికలు జరగనున్నాయని వార్తా కథనం పేర్కొంది. ఎన్నికలకు మూడు వారాల కంటే తక్కువ సమయం ముందు ఈ భారీ నిరసనలు చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇళ్ల కొరత, అద్దెల పెరుగుదల, నిత్యావసరాల ధరలు ఇప్పుడు ప్రజల ప్రధాన సమస్యలుగా మారాయి. ఈ అంశాలు ఎన్నికల్లోనూ కీలక చర్చగా మారే అవకాశం ఉంది. ప్రజల ఆగ్రహాన్ని రాజకీయ పార్టీలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.