స్పైస్‌జెట్‌కు పెను సంక్షోభం.. డీజీసీఏ షో-కాజ్ నోటీసు.. 7 రోజుల డెడ్‌లైన్
SpiceJet Crisis: తక్కువ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
స్పైస్‌జెట్‌కు పెను సంక్షోభం.. డీజీసీఏ షో-కాజ్ నోటీసు.. 7 రోజుల డెడ్‌లైన్
SpiceJet Crisis: తక్కువ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితులు వేగంగా దిగజారుతుండటంతో, సంస్థను పూర్తిగా మూసివేసే పరిస్థితి వస్తుందా అనే ఆందోళన ప్రయాణికుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరిలోనూ మొదలైంది. విమానయాన రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నవంబర్ 17న స్పైస్‌జెట్‌కు కఠినమైన షో-కాజ్ నోటీసు జారీ చేసింది. కార్యకలాపాలు పడిపోవడం, విమానాల రద్దు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పీటీఐ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొంటున్నాయి. వివరణ ఇచ్చేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు మాత్రమే ఉండగా, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కార్యకలాపాలపై మరింత ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. చాలా విమానాలు నిలిచిపోగా, వాటిని తిరిగి నడిపేందుకు స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
డీజీసీఏ కఠిన హెచ్చరిక ఎందుకంటే..
స్పైస్‌జెట్ పనితీరు క్రమంగా క్షీణిస్తోందని డీజీసీఏ తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది. ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) పడిపోవడంతో పాటు విమానాల ఆలస్యాలు, రద్దులు పెరిగాయని, ఆమోదించిన షెడ్యూల్‌ను పాటించడంలో విఫలమైందని ఎత్తిచూపింది. సంస్థలోని చాలా విమానాలు గ్రౌండ్ అయినప్పటికీ, వాటిని తిరిగి సర్వీసులోకి తీసుకురావడానికి నమ్మదగిన ప్రణాళిక సమర్పించలేదని నియంత్రణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా, ఆలస్యాలు, రద్దుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సహాయక ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
66కు అనుమతి.. నడుస్తున్నది 15 విమానాలే
క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉందో శీతాకాలపు షెడ్యూల్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, శీతాకాలపు షెడ్యూల్ కింద రోజుకు సుమారు 66 విమానాలు నడిపేందుకు డీజీసీఏ అనుమతి ఇవ్వగా, వాస్తవంగా రోజుకు 15 విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అయినప్పటికీ పూర్తి షెడ్యూల్‌కు బుకింగ్‌లు తీసుకుంటూ ఉండటంతో, చివరి నిమిషంలో విమానాలు రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాహకులు డీఐఏఎల్ వరుసగా రెండో రోజు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. శుక్రవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో స్పైస్‌జెట్ కార్యాచరణ సమస్యల వల్ల కొన్ని విమానాలపై ప్రభావం పడొచ్చని, బయలుదేరే ముందే నేరుగా ఎయిర్‌లైన్‌ను సంప్రదించి ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని సూచించారు. విమానాలు తగ్గడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది.
మార్కెట్ వాటా సగానికి పతనం.. స్టాక్‌పై దెబ్బ
తీవ్రమైన నగదు కొరత, ఆర్థిక ఇబ్బందులు స్పైస్‌జెట్ మార్కెట్ వాటాను భారీగా దెబ్బతీశాయి. ఆగస్టులో 1.2 శాతంగా ఉన్న దేశీయ మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో సగానికి పడిపోయి 0.6 శాతానికి చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే జనవరి, ఫిబ్రవరిలో 3.9 శాతంగా ఉన్న వాటా మార్చిలో 3.8 శాతానికి, ఏప్రిల్‌లో 3.4 శాతానికి, మేలో 2.5 శాతానికి, జూన్‌లో 1.9 శాతానికి, జూలైలో 1.6 శాతానికి తగ్గుతూ వచ్చింది. డీజీసీఏ నోటీసు వార్తలతో శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు దాదాపు 5 శాతం పడిపోయి రూ. 9.74 వద్దకు చేరింది. నోటీసుపై బీఎస్ఈ కూడా ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ. 5,500 కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రతిపాదనను బోర్డు ఆమోదించడానికి ఒక్క రోజు ముందే ఈ నోటీసు రావడం గమనార్హం.
బీమా చిక్కులు.. పెండింగ్ జరిమానాలు
స్పైస్‌జెట్ ఎదుర్కొంటున్న సమస్యలు దేశీయ విమానాలకే పరిమితం కాలేదు. తప్పనిసరి బీమా కవరేజీ పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొందని, సర్వీస్ ప్రొవైడర్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో అంతరాయాలు తలెత్తడంపై విదేశీ విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినట్లు డీజీసీఏ పేర్కొంది. గత మే నెలలో విధించిన జరిమానాను పదేపదే గుర్తు చేసినా చెల్లించలేదని, అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలకు కావాల్సిన అర్హత ప్రమాణాలు లేవని, రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్‌ను పదేపదే ఉల్లంఘించిందని నోటీసులో ప్రస్తావించింది. రాబోయే ఏడు రోజుల్లో డీజీసీఏ ప్రశ్నలకు బదులివ్వడం, రూ. 5,500 కోట్ల నిధుల ప్రణాళికతో విమానాలను తిరిగి నడపడం వంటి ద్వంద్వ సవాళ్లను స్పైస్‌జెట్ ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.




