Sri Lanka Dansal Tradition: లంకేయులకు దారి చూపుతున్న బుద్దిజం...సంక్షోభంపై అలుపెరుగని సహాయం

బౌద్ధ బోధనలతో పుట్టిన శ్రీలంక ‘దన్సల్’ సంప్రదాయం సంక్షోభ కాలంలోనూ ఉచిత ఆహారం, నీరు, సహాయంతో మానవత్వానికి కొత్త అర్థం చెబుతోంది.

Balachander
Published on: 28 May 2026 1:31 PM IST
Sri Lanka Dansal Tradition: లంకేయులకు దారి చూపుతున్న బుద్దిజం...సంక్షోభంపై అలుపెరుగని సహాయం
X

Sri Lanka Dansal Tradition: శ్రీలంకను వరసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. గతంలో రాజకీయంగా సంక్షోభం వెంటాడితే...దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న లంకను మధ్యప్రాచ్య యుద్ధం మరో సంక్షోభంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీంతోపాటే ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు భానుడు కూడా ఆ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇలాంటి విపత్కర కాలంలో ఆ దేశ ప్రజలను ఆకలి, దాహం నుంచి కాపాడుతూ వారిలో ధైర్యాన్ని నింపుతోంది శతాబ్ధాల కాలం నాటి బౌద్ధ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు దన్సల్‌ అని పిలుస్తారు. గౌతముని బోధనల్లోని దానం అనే సూత్రం ఆధారంగా ఈ దన్సల్‌ సంప్రదాయం పుట్టింది. దన్సల్‌ అంటే దానం అని అర్థం. ఇవే ఇప్పుడు లంకేయులకు సంజీవనిలా మారాయి. ఇప్పుడు శ్రీలంకలో బౌద్ధులు వీధివీధిన ఇలాంటి దాన శిభిరాలను ఏర్పాటు చేసి రోడ్డుపై వెళ్తున్న అపరిచితులకు ఉచితంగా ఆహారం, పానీయాలు అందిస్తున్నారు. సంక్షోభంలో ఆకలితో ఇబ్బందులు పడుతున్నవారికి బౌద్ధులు తమకు తోచిన ఈ సహాయం చేస్తున్నారు.

దన్సల్‌ ప్రాముఖ్యత ఏంటి?

శ్రీలంకలో ప్రతి ఏటా మే నెలలో వచ్చే వెస్సాక్ పండుగ నుండి జూలై వరకు ఈ దన్సల్ సందడి వీధుల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కన తాత్కాలికంగా చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి, బాటసారులను ఆపి మరీ ప్రేమతో అన్నదానం చేస్తారు. శ్రీలంక ప్రాచీన గ్రంథం 'మహావంశం' ప్రకారం, ఈ సంప్రదాయం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటి నుండి సాగుతోంది. ఒకప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ధనిక కుటుంబాలు ఏర్పాటు చేసిన ఈ సత్రాలు, కాలక్రమేణా సామాన్యులందరూ కలిసి నడిపే వీధి అన్నదానాలుగా రూపాంతరం చెందాయి. వివిధ దేశాల్లో దానం చేసే విధానం మారినా వాటి ప్రాధాన్యం ఒక్కటే. కాకపోతే బుద్ధిజం స్థిరపడిన శ్రీలంకలో దానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటారు.

సంక్షోభంలో పెరిగిన బాధ్యత ... ఆకలి ఎరుగని లంక

గతంలో కేవలం పండుగ సరదాగా సాగిన ఈ దానాలు, ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల వల్ల మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కరెంట్ బిల్లులు, ఇంధన ధరలు పెరిగి సామాన్యుడు బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ దాన్సల్ వారి ఆకలి తీరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కేవలం ఆహారమే కాకుండా, ప్రజల కష్టాలను గుర్తించి మరింత ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నారు. పండుగ వలసల భారాన్ని తగ్గించడానికి ఒక బిస్కెట్ కంపెనీ ఏకంగా 25,000 ఉచిత రైలు టికెట్లను కొలంబో స్టేషన్‌లో పంపిణీ చేసింది. గర్భిణీ స్త్రీలకు పొడి రేషన్, విద్యార్థులకు నోట్‌బుక్స్, రాత్రి పూట ఉచితంగా కంటి పరీక్షలు చేసే డాక్టర్లు, ఉచితంగా హెయిర్‌కట్ చేసే సెలూన్ యజమానులు ఇలా ఎవరికి తోచిన సేవ వారు చేస్తున్నారు. ఈ సంప్రదాయం ఇప్పుడు కేవలం బౌద్ధులకే పరిమితం కాలేదు. వెస్సాక్‌ పండుగ సమయంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటుతున్నారు.

సమాజమే కుటుంబం

శ్రీలంక సమాజం 'నేను' అనే వ్యక్తిగత స్వార్థం కంటే 'మనమంతా ఒకే సమాజం' అనే సామూహిక జీవన విధానాన్ని నమ్ముతుంది. కష్టకాలంలో చేసే దానానికే అత్యంత విలువ ఉంటుందని బౌద్ధ భిక్షువులు చెబుతారు. ఈ దాన్సల్ ఇచ్చే సందేశం ఒక్కటే... "ఈ గడ్డపై ఎవరూ ఆకలితో పడుకోకూడదు". లంకేయుల ఈ అలుపెరుగని సహాయ గుణం ప్రపంచ దేశాలకు ఒక గొప్ప పాఠం. ప్రతి దేశం దీనిని ఆదర్శంగా తీసుకుంటే సంక్షోభంలో పేదలు ఆకలితో అలమటించకుండా... ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రయాణాలు చేయలేమనే బాధలేకుండా... డబ్బులు లేవని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా ఉంటారు. సంక్షోభాలు తలెత్తుతున్నాయని బాధపడే బదులు...సంక్షోభానికి మూలాలు గుర్తించి దానికి చికిత్స చేసినపుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేదంటే అప్పటి వరకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story