Stock Market: స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్.. ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు జంప్!
Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు. తగ్గిన ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో ఇన్వెస్టర్ల సంపదకు ఒకేరోజు రూ.6 లక్షల కోట్ల లాభం వచ్చాయి. పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్.. ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు జంప్!
Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుసగా మూడో రోజు లాభాలను కొనసాగిస్తూ బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు అదరగొట్టాయి. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.6 లక్షల కోట్లు పెరగడం విశేషం. దీంతో బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439 లక్షల కోట్ల మార్కును దాటింది.
ఐటీ రంగంలో మెరుపులు..
నేటి మార్కెట్ ర్యాలీలో ఐటీ స్టాక్స్ కీలక పాత్ర పోషించాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% పైగా లాభపడి అగ్రగామిగా నిలిచింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 3% వరకు పెరిగాయి. వీటితో పాటు జొమాటో (ఎటర్నల్), ఎం అండ్ ఎం, ట్రెంట్, అదానీ పోర్ట్స్ కూడా 2% లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ రోజు భారీ లాభాల మధ్య కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాలు ఇవే..
* హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల గతంలో పెరిగిన చమురు ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. టర్కీ ద్వారా చమురు ఎగుమతులకు ఇరాక్, కుర్దిష్ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం సరఫరా ఆందోళనలను తగ్గించింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $102 వద్ద, WTI క్రూడ్ $94.53 వద్ద కొనసాగుతున్నాయి.
* అమెరికా మార్కెట్లు (వాల్ స్ట్రీట్) లాభాలతో ముగియడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. జపాన్ నిక్కీ 2%, దక్షిణ కొరియా కోస్పి 4% మేర భారీ లాభాలను నమోదు చేశాయి. ఐరోపా మార్కెట్లు కూడా గ్రీన్ మార్కులో కొనసాగుతున్నాయి.
* అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడులు తగ్గడం ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. 10 ఏళ్ల బాండ్ దిగుబడి 4.198%కి, రెండేళ్ల బాండ్ దిగుబడి 3.669%కి పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (FOMC) సమావేశం నేపథ్యంలో మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నాయి.
* మార్చి మొదటి వారంలో యుద్ధ మేఘాల వల్ల మార్కెట్లు 10% వరకు పడిపోయాయి. షేర్ల ధరలు భారీగా తగ్గడంతో ఇన్వెస్టర్లు తక్కువ ధరకే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం మార్కెట్ వేగాన్ని పెంచింది.




