Strait of Hormuz: హోర్ముజ్ జలసంధి మూసివేత.. ప్రపంచ దేశాల్లో మళ్లీ చమురు భయాలు

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరుకున్నాయి.

CR Reddy
Published on: 23 Aug 2026 7:59 AM IST
Strait of Hormuz
X

Strait of Hormuz

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరుకున్నాయి. ఆ కీలక సముద్ర మార్గాన్ని కొత్త అమెరికన్ ప్రాంతంగా అభివర్ణిస్తూ డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వాషింగ్టన్ తన వైఖరిని మార్చుకునే వరకు సముద్ర మార్గాన్ని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ, హోర్ముజ్ జలసంధిని న్యూ యూఎస్ టెరిటరీగా అభివర్ణించారు. ఆగస్టు 18న కూడా ఆయన ఇదే రకమైన ఫోటోను పోస్ట్ చేశారు. అంతకంటే ముందు ఆగస్టు 14న పోలీస్ అకాడమీ సమావేశంలో మాట్లాడుతూ, త్వరలోనే ఈ ప్రాంతాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని చెప్పారు. ట్రంప్ చేస్తున్న ఈ వరుస పోస్టులు ఇరు దేశాల మధ్య మంటలను మరింత రాజేస్తున్నాయి.

ఇరాన్ ఘాటు హెచ్చరిక

అమెరికా తీరుపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సేన్ రెజాయ్ మాట్లాడుతూ, హోర్ముజ్ మార్గం ప్రస్తుతం మూసివేసి ఉందని వెల్లడించారు. అమెరికా తన మొండి వైఖరిని వీడి, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మార్గాన్ని తెరిచే ప్రసక్తి లేదన్నారు. కేవలం మాటలు, చర్చలతో సమస్య సమసిపోదని, అమెరికా క్షేత్రస్థాయిలో చర్యలు చూపించాలని స్పష్టం చేశారు.

పెరిగిన నౌకల రాకపోకలు

ఇరాన్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, గత కొన్ని రోజులుగా హోర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు పెరగడం గమనార్హం. బ్రిటన్ సముద్ర వ్యాపార పర్యవేక్షణ సంస్థ అందించిన వివరాల ప్రకారం, గత వారం సుమారు 200 నౌకలు ఈ మార్గం నుంచి ప్రయాణించాయి. అంతకుముందు వారాల్లో ఈ సంఖ్య 40 నుంచి 150 వరకు మాత్రమే ఉండేది. రవాణా నిలిచిపోకుండా ఉండేందుకు సముద్ర రవాణా సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.

ఒమన్ మార్గం ద్వారా రవాణా

సముద్ర డేటా విశ్లేషణ సంస్థ కెప్లర్ నివేదిక ప్రకారం, గత రెండు వారాల్లో హోర్ముజ్ గుండా వెళ్లిన 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఉపయోగించుకున్నాయి. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఆమోదించిన ఈ మార్గానికి అమెరికా మద్దతు ఉంది. ఉద్రిక్తతల నడుమ ఇరాన్, ఒమన్ దేశాలు ఒక మధ్యస్థ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే దీనిపై ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధి మూసివేత సుదీర్ఘకాలం కొనసాగితే అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమనే ప్రమాదం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story