Strait of Hormuz: హోర్ముజ్‌లో వరుస దాడులు..27 మంది భారతీయులతో వెళ్తున్న నౌకపై దాడి
Strait of Hormuz: గ్లోబల్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ మంటల్లో కాలుతోంది.
Strait of Hormuz
Strait of Hormuz: గ్లోబల్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ మంటల్లో కాలుతోంది. ఇరాన్, అమెరికా మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతల క్రమంలో హోర్ముజ్ ప్రాంతం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని మృత్యుకూపంగా మారింది. గత 48 గంటల వ్యవధిలోనే ఇక్కడ కనీసం రెండు వాణిజ్య నౌకలు సముద్రంలో నింపిన పేలుడు పదార్థాలు (మైన్లు), మిస్సైల్ దాడులకు గురై అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణిస్తున్న నౌకల్లో ఏకంగా 29 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
మైన్ దాడికి గురైన ఎంటీ లూజ్ 1
శుక్రవారం రోజున హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఎంటీ లూజ్ 1 అనే చమురు ట్యాంకర్ ఇంజిన్ గదిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంతో ట్యాంకర్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఓడలో ఏకంగా 27 మంది భారతీయ సిబ్బంది చిక్కుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 29న లైబీరియా జెండాతో వెళ్తున్న మరొక నౌకపై క్షిపణి దాడి జరగ్గా, అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ రెండు నౌకల్లో ఉన్న మొత్తం 29 మంది భారతీయులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వెల్లడించారు.
ఇరాన్ ఇస్లామిక్ విప్లవాత్మక గార్డ్స్ అదుపులోకి ట్యాంకర్లు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నాయనే నెపంతో ఐఆర్‌జీసీ బలగాలు మూడు చమురు ట్యాంకర్లను అదుపులోకి తీసుకున్నాయి. ఒమన్ పట్టణమైన ఖసాబ్‌కు ఉత్తరాన 17 కిలోమీటర్ల దూరంలో పనామా జెండాతో వెళ్తున్న రిటీ అనే ముడి చమురు ట్యాంకర్‌పై కూడా దాడి జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఒమన్ నావికాదళం వెంటనే స్పందించి ఆ నౌకలోని 25 మంది నావికులను కాపాడి వైద్య సహాయం అందించింది.
సముద్రంలో మైన్లను తొలగించామన్న అమెరికా
మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్ సముద్ర మార్గంలో ఇరాన్ బిగించిన సముద్రపు మైన్లను తమ నావికాదళం విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ రవాణా మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు యూఎస్ మిలిటరీ నిరంతరం కాపలా కాస్తోందని చెప్పారు. వేసవి కాలం నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 1.5 బిలియన్ బారెళ్ల కంటే ఎక్కువ చమురు ఎగుమతి కాకుండా అడ్డంకులు లేకుండా సాయం చేశామని తెలిపారు.
భారత్ నిరంతర పర్యవేక్షణ
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. హోర్ముజ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న భారతీయ నావికుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నారు. సముద్రంలో భద్రతకు సంబంధించి లండన్‌కు చెందిన UKMTO ఏజెన్సీ కూడా నిరంతరం సమాచారాన్ని పర్యవేక్షిస్తూ ఇతర నౌకలను అప్రమత్తం చేస్తోంది.




