Strait of Hormuz: హోర్ముజ్‌ జలసంధిలో పూర్వపు స్థితి సాధ్యమౌతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

ప్రపంచ ఇంధనానికి జీవనాడిగా ఉండే హోర్ముజ్‌ జలసంధి సంక్షోభం ఎట్టకేలకు ఓ ముగింపుకు వచ్చేలా కనిపిస్తున్నది. గత మూడు నెలలుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడుతున్నాయి.

Balachander
Published on: 25 May 2026 12:26 PM IST
Strait of Hormuz: హోర్ముజ్‌ జలసంధిలో పూర్వపు స్థితి సాధ్యమౌతుందా?  నిపుణులు ఏం చెబుతున్నారంటే
X

Strait of Hormuz: ప్రపంచ ఇంధనానికి జీవనాడిగా ఉండే హోర్ముజ్‌ జలసంధి సంక్షోభం ఎట్టకేలకు ఓ ముగింపుకు వచ్చేలా కనిపిస్తున్నది. గత మూడు నెలలుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడుతున్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి దారులు తెరుచుకున్నాయి. అంగీకరించిన శాంతి ఒప్పందంపై ఇరు వర్గాలు సంతకాలు చేస్తే... ఈ మార్గంలో మళ్లీ నౌకల ప్రయాణం ప్రారంభమౌతుంది. అయితే, ఒప్పందం కుదిరిన వెంటనే పూర్తి స్థాయిలో, పూర్వపు స్థితిలో నౌకల రవాణా సాధ్యమౌతుందా అంటే సాధ్యం కాదని అంటున్నారు నిపుణులు.

30 రోజుల కాలపరిమితి.... ఆంక్షల ఎత్తివేత

ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'తస్నిమ్' కథనం ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ శాంతి ప్రతిపాదనలు కొలిక్కి వచ్చాయని ప్రకటించారు. ఒప్పందం కుదిరిన 30 రోజుల్లోగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాల్సి ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా స్తంభించిపోయిన ఇరాన్ ఆర్థిక ఆస్తులను కూడా అమెరికా విడుదల చేయాల్సి ఉంది. దశల వారీ ప్రణాళిక ద్వారా జలసంధిలో రవాణా మునుపటి స్థాయికి చేరుకుంటుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన తరువాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటేనే రవాణా సాధ్యమౌతుంది. అమెరికా స్తంభింపజేసిన ఆస్తులను రిలీజ్‌ చేసిన తరువాతనే ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఓడరేవులపై దిగ్బంధం ఎత్తివేసినా...ఆస్తులను రిలీజ్‌ చేయకపోతే ఇరాన్‌ అంశం మళ్లీ మొదటికి రావొచ్చు.

ఎదురుకానున్న సవాళ్లు

ఒప్పందం కాగితం మీద సాధ్యమైనా, క్షేత్రస్థాయిలో పూర్వపు స్థితి రావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు పెద్ద అడ్డంకులు ఉన్నాయి. ఒకటి యూరేనియం డైల్యూషన్‌ ప్రక్రియ. అమెరికా డిమాండ్ ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్న 60 శాతం శుద్ధి చేసిన యూరేనియంను డైల్యూట్ చేయాలి. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న 420.9 కిలోల యూరేనియంను ఈ విధంగా మార్చి, దానిని ఒక సురక్షితమైన మూడో దేశానికి తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంత తేలికగా ముగిసేది కాదు. అంతేకాదు, కీలకమైన రెండో ప్రక్రియ నిలిచిపోయిన నౌకల రద్దీ. యుద్ధ వాతావరణం కారణంగా గత మూడు నెలలుగా సుమారు 1500 నుంచి 2000 వరకు సరుకు రవాణా నౌకలు వివిధ పోర్టుల్లో నిలిచిపోయాయి. వీటి క్లియరెన్స్ పూర్తి కావడానికే కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది.

ప్రాంతీయ సార్వభౌమత్వం... భద్రతా సవాళ్లు

మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా రాకపోకలపై ఇరాన్, ఒమన్ దేశాల అధికారులు చర్చలు జరిపారు. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మాత్రం...తమ జాతీయ భద్రత దృష్ట్యా హోర్ముజ్ జలసంధిని నియంత్రించే 'చట్టపరమైన హక్కు' ఇరాన్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేయడం గమనార్హం. శాంతి ఒప్పందం దాదాపుగా ఖరారైనా...ఒకటి రెండు క్లాజులపై ఇరు దేశాల మధ్య ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా గనుక అడ్డంకులు సృష్టించకుండా ఉంటే, ఈ ఒప్పందం అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో హోర్ముజ్‌ జలసంధి అందుబాటులోకి వచ్చి ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తే...ప్రపంచంతో పాటు భారత్‌కు కూడా ఉపశమనం లభించినట్టే. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టును తిరిగి భారత్‌ తన నియంత్రణలోకి తీసుకొచ్చుకునే అవకాశం లభిస్తుంది. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలుకు అవకాశం ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story