Mine Collapse: భారీ ప్రమాదం.. కుప్పకూలిన గోల్డ్ మైన్, 11 మంది దుర్మరణం
Mine Collapse: దేశంలో అక్రమంగా అలాగే సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న ఒక బంగారు గని సొరంగం ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది.
Mine Collapse: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలో అక్రమంగా అలాగే సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న ఒక బంగారు గని సొరంగం ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతా వారి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే సూడాన్ దేశంలో ఇలాంటి బంగారు గని కూలిపోవడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. దేశం ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతుండగా, ఈ మైనింగ్ ప్రమామాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఉత్తర-తూర్పు రెడ్ సీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన ఓనిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి చెందిన సూడానీ మినరల్ రిసోర్సెస్ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆదివారం నాటికి 11 మృతదేహాలను వెలికితీశారు. 30 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే గనుల వద్ద భద్రతా నియమాలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూడాన్ దేశంలో ఇలాంటి చిన్నతరహా, అనధికారిక బంగారు గనులు వేల సంఖ్యలో విస్తరించి ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం దేశంలోని పశ్చిమ భాగంలో జరిగిన మరో గని కూలుడు ఘటనలో ఏకంగా 60 మందికి పైగా కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. ఆ ప్రాంతం పారామిలిటరీ బలగాలైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నియంత్రణలో ఉంది. గత మూడేళ్లకు పైగా సూడానీ సైన్యానికి, ఈ బలగాలకు మధ్య తీవ్రమైన పోరు సాగుతోంది. ఈ అంతర్యుద్ధం కారణంగా దేశంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన అక్షావు, అంతులేని ఆకలితో అల్లాడిపోతున్నాయి.
ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ బంగారు గనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గనుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తుతోంది. ఏదేమైనప్పటికీ, ఈ భీకరమైన యుద్ధ వాతావరణం మధ్య ఉపాధి కోసం గనుల్లోకి వెళ్తున్న సామాన్య కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ప్రభుత్వాలు, బాధ్యతాయుతమైన యంత్రాంగాలు తక్షణమే స్పందించి గనుల వద్ద తగిన రక్షణ చర్యలు కల్పించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




