Super El Nino: ప్రపంచాన్ని వణికించనున్న 'సూపర్ ఎల్‌నినో'.. భానుడి భగభగలకు లక్షల ప్రాణాలు గాల్లోకి!

Super El Nino: సూపర్ ఎల్‌నినోతో 2026-27లో ప్రపంచవ్యాప్తంగా వేడి మరణాలు పెరిగే అవకాశం. భారత్‌లో 15,800 అదనపు మరణాలపై నివేదిక హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 6:11 AM IST
Super El Nino
X

Super El Nino: ప్రపంచాన్ని వణికించనున్న 'సూపర్ ఎల్‌నినో'.. భానుడి భగభగలకు లక్షల ప్రాణాలు గాల్లోకి!

Super El Nino: ప్రపంచానికి మరోసారి భారీ వేడి ముప్పు పొంచి ఉందా? ‘సూపర్ ఎల్‌నినో’ విజృంభిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదిక హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పేద దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది.

2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎండ వేడి కారణంగా అదనంగా కనీసం 4.5 లక్షల మంది మరణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో భారత్‌లోనే సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే అవకాశముందని అంచనా వేసింది.

ఇక్కడ చెప్పిన మరణాలు సాధారణ పరిస్థితుల్లో నమోదయ్యే మరణాలకు అదనంగా ఉండే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఈ అంచనాల కోసం 1996–2025 కాలాన్ని బేస్‌లైన్‌గా తీసుకున్నట్లు తెలిపింది.

పేద దేశాలపైనే ఎక్కువ ప్రభావం?

సూపర్ ఎల్‌నినో ప్రభావం అన్ని దేశాలపై ఒకేలా ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, పరిమిత ఆరోగ్య సదుపాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.

ఆఫ్రికాలోని సాహిల్ రీజియన్‌లోనే 66,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో నైజీరియాలో 31,400, సుడాన్‌లో 17,500, నైజర్‌లో 10,000, ఛాడ్‌లో 8,000 వరకు మరణాలు చోటుచేసుకోవచ్చని పేర్కొంది.

భారత్‌లో 15,800 మరణాల అంచనా

ఆగ్నేయాసియాలోనూ వేడి ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నివేదిక చెబుతోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌ల్యాండ్, కంబోడియా దేశాల్లో కలిపి 19,400 అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక ఇండోనేసియాలో సుమారు 19,300 మంది, బ్రెజిల్‌లో 13,300 మంది వరకు అదనంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

భారత్ విషయానికి వస్తే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక 15,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న వేసవిలో భారత్, పాకిస్థాన్‌లలో వేడి కారణంగా మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

ముందస్తు చర్యలతో ముప్పును తగ్గించే అవకాశం

అయితే ఇలాంటి అంచనాలు కేవలం ఆందోళన కలిగించేందుకు కాదని క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ పేర్కొంది. ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది.

ముఖ్యంగా హీట్ వార్నింగ్స్‌ను ముందుగానే జారీ చేయడం, కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయాలను పెంచడం వంటి చర్యలు కీలకంగా మారొచ్చు. అలాగే ఎండలో పనిచేసే ఉద్యోగులకు రక్షణ కల్పించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయడం కూడా అవసరమని నివేదిక సూచించింది.

మొత్తంగా.. సూపర్ ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుందన్నది వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, స్థానికంగా తీసుకునే ముందస్తు చర్యలపై ఆధారపడి ఉంటుంది. అయితే అధిక వేడిని ఎదుర్కొనే ప్రాంతాల్లో ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్