Typhoon Noul : 145 కి.మీ వేగంతో గాలులు.. గాల్లో లేచిపోతున్న భవంతులు, రాత్రికి రాత్రే ఖాళీ అయిన నగరాలు
Typhoon Noul : చైనాలోని శనివారం, ఆదివారాల్లో 'నోల్' తుఫాను తీవ్ర భయాందోళన సృష్టించింది.
Typhoon Noul
Typhoon Noul : చైనాను భయంకరమైన నోల్ తుఫాను అతలాకుతలం చేస్తోంది. గంటకు ఏకంగా 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో దక్షిణ చైనా, హాంగ్‌కాంగ్ తీర ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనా జాతీయ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం.. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:50 గంటల ప్రాంతంలో ఈ తుఫాను దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలోని హుయిజౌ నగరానికి సమీపంలో తీరం దాటింది.
3.4 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించిన అధికారులు గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు గాను శనివారం మధ్యాహ్నానికే దాదాపు 3.4 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ తుఫాను గ్వాంగ్‌డాంగ్ అంతర్భాగంలోకి వెళ్లేకొద్దీ కొద్దిగా బలహీనపడుతున్నప్పటికీ, రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
స్తంభించిన రవాణా వ్యవస్థ
నోల్ తుఫాను ప్రభావంతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హాంగ్‌కాంగ్ విమానాశ్రయ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. శనివారం, ఆదివారాల్లో నడవాల్సిన 150కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఆదివారం నడవాల్సిన అన్ని రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు చైనా న్యూస్ సర్వీస్ వెల్లడించింది. దక్షిణ గ్వాంగ్‌డాంగ్, ఆగ్నేయ ఫుజియాన్ ప్రాంతాల్లో వారాంతంలో మరింత తీవ్రమైన వర్షపాతం నమోదుకానుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
కూలిన కట్టడాలు, తైవాన్‌పైనా తీవ్ర ప్రభావం
హాంగ్‌కాంగ్ నగరానికి తుఫాను సమీపిస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం ఒక ఎత్తైన భవనంపై నిర్మించిన పెద్ద స్క్యాఫోల్డింగ్ ఒక్కసారిగా కూలిపడింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. మరోవైపు, ఈ తుఫాను తైవాన్‌కు దక్షిణాన సముద్రం మీదుగా ప్రయాణిస్తూ దూరంగా వెళ్లినప్పటికీ, దాని ప్రభావంతో తైవాన్ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నెలలో చైనాను వణికిస్తున్న వరుస తుఫానులు
చైనాను ఈ నెలలో వరుస తుఫానులు చుట్టుముడుతున్నాయి. ఈ జూలై నెల ప్రారంభంలో బావి తుఫాను తూర్పు చైనాపై విరుచుకుపడి భారీ వర్షాలు, గాలులు తీసుకురావడంతో దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇది జూలై 11న తీరం దాటింది. అంతేకాకుండా, జూలై 3వ తేదీన మేసాక్ అనే మరొక తుఫాను కూడా దక్షిణ చైనా తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు నోల్ తుఫాను రాకతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.




