Taco Bell: అమెరికాను భయపెడుతున్న టాకోబెల్‌... 4300 మందిపై ఎఫెక్ట్‌

అమెరికాను టాకోబెల్‌ అవుట్‌లెట్లు భయపడెతున్నాయి. ఇందులోని ఐస్‌బర్గ్‌ లెట్యూస్‌లో ప్రమాదకరమైన సైక్లోస్పోరా ఉన్నట్టుగా గుర్తించారు. దీని కారణంగా 4300 మందికి పైగా అమెరికన్లు అస్వస్థతకు గురయ్యారు.

Balachander
Published on: 17 July 2026 12:02 PM IST
Taco Bell: అమెరికాను భయపెడుతున్న టాకోబెల్‌... 4300 మందిపై ఎఫెక్ట్‌
X

Taco Bell: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించే అమెరికాలో ఇప్పుడు ఒక చిన్న ఆకుకూర ముక్క అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం 'టాకో బెల్' అవుట్‌లెట్లలో తిన్న వేలాది మంది వినియోగదారులు ఒక్కసారిగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం అక్కడ కలకలం రేపుతోంది. మెక్సికన్ తరహా ఆహార పదార్థాలను విక్రయించే టాకో బెల్ రెస్టారెంట్లలో ఉపయోగించిన కలుషిత ఐస్‌బర్గ్ లెట్యూస్ ద్వారా ఒక ప్రమాదకరమైన సూక్ష్మ పరాన్నజీవి వ్యాపించినట్లు అమెరికా నియంత్రణ సంస్థలు గుర్తించాయి. ఈ తీవ్రమైన ఆహార సంక్షోభం కారణంగా ఒక్క మిచిగాన్ రాష్ట్రంలోనే ఏకంగా 4,300 మందికి పైగా ప్రజలు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాల బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ స్వయంగా స్పందిస్తూ, ట్రంప్ యంత్రాంగం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని ప్రకటించడం ఈ సంక్షోభం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది.

సైక్లోస్పోరా ముట్టడి ... 5 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన సంయుక్త దర్యాప్తులో 'సైక్లోస్పోరా' అనే మైక్రోస్కోపిక్ పరాన్నజీవి ఈ ఇన్ఫెక్షన్‌కు కారణమని తేలింది. ఈ కలుషిత ఆహారం వల్ల అమెరికాలోని మిచిగాన్, ఇండియానా, కెంటుకీ, ఒహియో, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. ఇక ల్యాబ్ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 1,644 కేసులు అధికారికంగా ధృవీకరించబడగా, మొత్తం బాధితుల సంఖ్య 4,300 దాటినట్లు మిచిగాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో 102 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి దాదాపు రెండు వారాల సమయం పడుతుండటంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సరఫరా గొలుసులో లోపం ... మార్కెట్లో దెబ్బతిన్న షేర్లు

ఈ ఇన్ఫెక్షన్‌కు మెక్సికోకు చెందిన ఒకే ఒక్క సప్లయర్ సరఫరా చేసిన కలుషిత ఆకుకూరలే కారణమని దర్యాప్తులో తేలింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం 'ట్రైలర్ ఫార్మ్స్' అనే సంస్థ దీనికి మూలంగా భావిస్తున్నారు. యమ్ బ్రాండ్స్ యాజమాన్యంలోని టాకో బెల్ వెంటనే స్పందించి, బాధితులు ఉన్న రాష్ట్రాలలోని తమ అవుట్‌లెట్ల నుండి లెట్యూస్ ఆకుకూరలను 24 గంటల్లో తొలగించినట్లు ప్రకటించింది.

వ్యాపార రంగంపై భయంకర ప్రభావం

ఈ భయం ఎంతలా వ్యాపించిందంటే, లెట్యూస్ ఆకుకూరలను ఎక్కువగా వాడే ప్రముఖ సలాడ్ చైన్ సంస్థ 'స్వీట్ గ్రీన్' షేర్లు ఈ ఒక్క వారంలోనే ఏకంగా 25 శాతం పతనం కావడం గమనార్హం. తమ సరఫరాలో ఎలాంటి లోపాలు లేవని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ, అమెరికన్ వినియోగదారులలో నెలకొన్న భయాందోళనలు గ్లోబల్ ఫుడ్ బిజినెస్‌ను దెబ్బ తీశాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాకపోయినప్పటికీ, ఈ సంఘటన అంతర్జాతీయ ఫుడ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంతటి కఠినమైన తనిఖీలు అవసరమో మరోసారి నిరూపించింది. ఇలాంటి విషయాలు జరిగినపుడే అధికారులు స్పందించకుండా నిరంతరం తనిఖీలు చేపడితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story