Walmart Shooting: వాల్‌మార్ట్ స్టోర్ బయట కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి

వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ బయట జరిగిన కాల్పుల్లో భారతీయ మూలాలకు చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు.

CR Reddy
Published on: 22 Nov 2026 6:44 AM IST
Walmart Shooting: వాల్‌మార్ట్ స్టోర్ బయట కాల్పులు.. ఇద్దరు భారతీయుల మృతి
X

Walmart Shooting: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన సరే నగరంలో ఘోరం జరిగింది. ఒక వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ బయట జరిగిన కాల్పుల్లో భారతీయ మూలాలకు చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను 23 ఏళ్ల గగన్‌ప్రీత్ రెహల్, 24 ఏళ్ల సుఖ్‌జీత్ కౌర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని డెల్టా టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నవంబర్ 15వ తేదీ రాత్రి 10:38 గంటల ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో ఇద్దరిపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో సరే పోలీస్ సర్వీస్, అత్యవసర వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

టార్గెటెడ్ కిల్లింగ్‌గా అనుమానం

తీవ్రంగా గాయపడిన రెహల్, సుఖ్‌జీత్ కౌర్‌లను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ జంట హత్యలను పక్కా ప్లాన్‌తో చేసిన టార్గెటెడ్ అటాక్‎గా కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు రెహల్‌పై గతంలోనే ఆయుధాలకు సంబంధించిన నేరాల రికార్డు పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. మరోవైపు సుఖ్‌జీత్ కౌర్‌కు కెనడాలో తెలిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

దోషులను పట్టుకుంటామన్న పోలీసులు

ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రతినిధి సార్జెంట్ ఫ్రెడా ఫోంగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే తమ వారిని కోల్పోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయని ఆమె అన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకునే ఈ కాల్పులు జరిపినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఈ హత్యలకు కారణం ఏమిటి, అసలు దీని వెనుక ఎవరున్నారనేది తేల్చడానికి అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నామని, బాధ్యులను కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

15 నిమిషాల్లోనే కాలిపోయిన కారు

ఈ కాల్పుల కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వాల్‌మార్ట్ బయట కాల్పులు జరిగిన 15 నిమిషాల్లోపే సమీప ప్రాంతంలో ఒక కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నాలుగు డోర్లు ఉన్న ఒక సెడాన్ కారు పూర్తిగా కాలిపోయి కనిపించింది. ఆ కారులో వచ్చి, దాన్ని అక్కడే వదిలేసి పారిపోయిన వ్యక్తులు ఎవరనే దానిపై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

కారు దగ్ధం ఘటనకు, హత్యలకు లింక్ ఉందా?

సాధారణంగా కెనడాలో ఇలాంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ జరిగినప్పుడు నిందితులు ఆధారాలు దొరక్కుండా తాము వాడిన కారును తగలబెట్టి పారిపోతుంటారు. అందుకే ఇప్పుడు దొరికిన కాలిపోయిన సెడాన్ కారుకు, రెహల్-కౌర్ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ రెండు ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కారు వదిలి పారిపోయిన నిందితుల వివరాలు తెలిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.