USA: అమెరికాలో ఏం జరుగుతోంది? బియ్యం, నీళ్లు, బ్యాటరీల కోసం భారీ డిమాండ్!

USA: అమెరికాలో వరుస సాంకేతిక అవాంతరాలు, బ్లాకౌట్ భయాలతో అత్యవసర సరకుల కొనుగోళ్లు పెరిగాయి. ఫ్రీజ్-డ్రైయిడ్ ఫుడ్, టాయిలెట్ పేపర్ల ధరలు పెరగగా, జనరేటర్ల కొరత ఏర్పడినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.

Arun Chilukuri
Updated on: 25 Nov 2026 4:00 PM IST
USA
X

USA: అమెరికాలో ఏం జరుగుతోంది? బియ్యం, నీళ్లు, బ్యాటరీల కోసం భారీ డిమాండ్!

USA: ఏఐ (AI) టెక్నాలజీ రంగంలో కొన్నేళ్లుగా దూసుకుపోతున్న అమెరికన్లలో ఇప్పుడు కొత్త ఆందోళన నెలకొంది. ఇటీవల వరుసగా ఎదురవుతున్న సాంకేతిక అవాంతరాలు అమెరికన్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు నిత్యావసర సేవలు నిలిచిపోయి, జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి రావచ్చన్న భయంతో జనం అత్యవసర సామగ్రిని భారీగా కొనుగోలు చేస్తున్నారు. క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి డిస్కౌంట్ల సీజన్ సమీపిస్తున్న వేళ రిటైలర్లు ఆఫర్లకు సిద్ధమవుతున్నా.. అత్యవసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం అత్యవసర వస్తువుల డిమాండ్, ధరల పెరుగుదల ఇలా ఉన్నాయి. ఫ్రీజ్-డ్రైయిడ్ ఆహార పదార్థాల ధర 12 శాతం పెరిగింది. గతేడాది ఇదే సీజన్‌లో వీటి ధర 9 శాతం తగ్గడం గమనార్హం.

గతేడాది తాము ట్రాక్ చేసిన 16 స్టాక్స్ జాబితాలో ఒక్కటి మాత్రమే అందుబాటులో లేకపోగా, ఇప్పుడు ఆ 16లో దాదాపు మూడో వంతు స్టాక్స్ 'నో స్టాక్'గా మారాయి. జనరేటర్ల వంటివి దొరకడం కూడా కష్టతరంగా మారింది. సెప్టెంబర్ నుంచి టాయిలెట్ పేపర్ల ధర 4 శాతం పెరిగింది. పేపర్ టవల్స్, బ్యాటరీలు, చెత్తబ్యాగ్‌ల ధరలు కూడా గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే పెరిగాయి.

బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సీజన్‌లో అత్యవసర వస్తువులు ఇప్పుడే తక్కువ ధరకు లభిస్తాయన్న ఉద్దేశంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. ప్రొపేన్, బాటిల్డ్ వాటర్, క్యాంపింగ్ గేర్, బియ్యం, క్యాన్లలోని ఆహార పదార్థాల కొనుగోళ్లు పెరిగినట్లు వాల్‌మార్ట్, కాస్ట్‌కో వంటి రిటైల్ దిగ్గజాలు వెల్లడించాయి.

జాతీయ స్థాయిలో బ్లాకౌట్ తప్పదంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వినియోగదారుల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. అమెరికాలో గతంలో ఎయిర్ ట్రాఫిక్, బ్యాంకింగ్ సర్వీసులు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కమ్యూనికేషన్లు వంటి కీలక వ్యవస్థలు సైతం సాంకేతిక అవాంతరాలతో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అమెరికన్లు అత్యవసర సరకులను నిల్వ చేసుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.