Princess Bajrakitiyabha : యువరాణి మరణం.. థాయ్ రాజ్య వారసత్వంపై ఉత్కంఠ

Princess Bajrakitiyabha : మూడేళ్లకు పైగా కోమాలో ఉన్న థాయిలాండ్ రాజకుమారి బజ్రకితియాభా (47) కన్నుమూశారు. ఈ మేరకు థాయిలాండ్ రాజభవనం (రాయల్ హౌస్‌హోల్డ్..

G Krishna
Published on: 12 Jun 2026 11:32 AM IST
Princess-Bajrakitiyabha
X

Princess-Bajrakitiyabha

Princess Bajrakitiyabha : మూడేళ్లకు పైగా కోమాలో ఉన్న థాయిలాండ్ రాజకుమారి బజ్రకితియాభా (47) కన్నుమూశారు. ఈ మేరకు థాయిలాండ్ రాజభవనం (రాయల్ హౌస్‌హోల్డ్) అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2022 డిసెంబర్‌లో తన పెంపుడు కుక్కలతో కలిసి వ్యాయామం చేస్తుండగా ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెలో మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ (Mycoplasma Infection) కారణంగా తీవ్రమైన గుండె లయ తప్పడం (Irregular Heartbeat) వల్లే ఆమె స్పృహ కోల్పోయినట్లు వైద్యులు అప్పట్లో నిర్ధారించారు.

"వైద్య బృందం ఆమెకు సాధ్యమైనంత అత్యంత కరెక్ట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ అందించినప్పటికీ, ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది" అని శుక్రవారం ఉదయం ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె చులాలాంగ్‌కార్న్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 19:48 గంటలకు (12:48 GMT) తుది శ్వాస విడిచినట్లు పేర్కొంది. ఆమె మరణంతో థాయ్ రాజకుటుంబం ఒక అత్యంత ప్రతిభావంతురాలైన సభ్యురాలిని కోల్పోయింది. అలాగే ఇప్పటివరకు స్పష్టత లేని తదుపరి వారసత్వ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాల్సిన వ్యక్తిని కోల్పోయినట్లయింది.

న్యాయవాదిగా, దౌత్యవేత్తగా విశేష సేవలు

రాజు వజిరాలాంగ్‌కార్న్ ఏడుగురు పిల్లలలో బజ్రకితియాభా అందరికంటే పెద్దవారు. ఆయన మొదటి భార్య, బంధువు అయిన ప్రిన్సెస్ సోమ్సవాలికి 1978 డిసెంబర్ 7న ఆమె జన్మించారు. ఆమె ప్రతిభావంతురాలైన న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుండి రెండు పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలను పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UN) థాయ్ మిషన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఆమె థాయిలాండ్‌కు తిరిగి వచ్చి బ్యాంకాక్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలోని అటార్నీ జనరల్ కార్యాలయాల్లో పనిచేశారు.

2012 నుండి 2014 వరకు ఆమె ఆస్ట్రియాలో థాయిలాండ్ రాయబారిగా సేవలందించారు. అక్కడ ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం (UNODC) తో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. థాయిలాండ్ జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీల దుస్థితిపై, శిక్షల సంస్కరణలపై ఆమె గళమెత్తారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉన్న దేశాలలో థాయిలాండ్ ఒకటి కావడం గమనార్హం.

తిరిగి థాయిలాండ్‌కు వచ్చిన తర్వాత, ఆమె ఆగ్నేయాసియాలో ఐక్యరాజ్యసమితి (UNODC) రూల్ ఆఫ్ లా అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టారు. చిన్నచిన్న డ్రగ్స్ కేసుల్లో కూడా కఠినమైన శిక్షలు విధించే థాయిలాండ్ నేర న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం ఆమె నిరంతరం కృషి చేశారు. 2021 లో ఆమె తండ్రి (రాజు) ఆమెను తన వ్యక్తిగత బాడీగార్డ్ విభాగానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించి, 'జనరల్' హోదాను ఇచ్చారు. కేవలం విద్యా, వృత్తిపరమైన రంగాల్లోనే కాకుండా, ఆమె ఫిట్‌నెస్ పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపించేవారు. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్స్ (సుదీర్ఘ పరుగు పందాలు) లో తరచూ పాల్గొనేవారు.

రాజ వారసత్వంపై నెలకొన్న సస్పెన్స్

ఆమెకున్న అద్భుతమైన సామర్థ్యాలు, తండ్రికి ఆమెపై ఉన్న నమ్మకం కారణంగా.. థాయిలాండ్ తదుపరి రాజ వారసురాలిగా ఆమె పేరుపై ఎన్నో ఊహాగానాలు సాగాయి. ప్రస్తుత రాజు వజిరాలాంగ్‌కార్న్ వయసు 73 ఏళ్లు కాగా, ఆయన ఇప్పటివరకు తన వారసుడిని అధికారికంగా ప్రకటించలేదు. థాయ్ సాంప్రదాయం ప్రకారం పురుషులు మాత్రమే వారసులు కావాలి, కానీ 1974 లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం మహిళలు కూడా సింహాసనాన్ని అధిష్టించే అవకాశం ఉంది.

రాజుకు ఐదుగురు కుమారులు ఉన్నప్పటికీ, రెండో భార్యకు జన్మించిన నలుగురు కుమారులను 1996 లోనే వారసత్వం నుండి తొలగించారు. వారు అప్పటినుంచి అమెరికాలోనే నివసిస్తున్నారు. ఇక మూడో భార్యకు జన్మించిన ఐదో కుమారుడు 'దిపాంగ్‌కార్న్' ప్రస్తుతం వారసుడిగా భావించబడుతున్నప్పటికీ, రాజకుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న థాయిలాండ్‌లో, మహారాజుగా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయనకు ఉన్న సామర్థ్యాలపై కొన్ని సందేహాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో థాయ్ రాయలిస్టులు (రాజ కుటుంబ మద్దతుదారులు) ప్రిన్సెస్ బజ్రకితియాభాను అత్యంత ఆశాజనకమైన నాయకురాలిగా చూశారు. ఆమె రాణిగా గానీ, ప్రిన్స్ దిపాంగ్‌కార్న్‌కు సహాయకురాలిగా (రీజెంట్) గానీ బాధ్యతలు చేపడుతుందని భావించారు. అయితే, ఇప్పుడు ఆమె హఠాన్మరణంతో థాయిలాండ్ తదుపరి రాజ వారసత్వ ప్రశ్న మళ్ళీ మొదటికి వచ్చింది. దేశంలోని కఠినమైన 'లెస్ మేజెస్టే' (రాజకుటుంబాన్ని విమర్శించడాన్ని నిషేధించే చట్టం) చట్టం కారణంగా దీనిపై బహిరంగంగా చర్చించే అవకాశం కూడా ఎవరికీ లేదు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story