Tim David: నా విధ్వంసం వెనుకున్న మాస్టర్‌మైండ్ అతడే.. అసలు విషయం చెప్పేసిన టిమ్ డేవిడ్!
Tim David credits Dinesh Karthik for his stunning Batting. ఆర్సీబీ విజయంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేశాడు. ఈ సుడిగాలి ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరో చెప్పాడు.
Tim David: నా విధ్వంసం వెనుకున్న మాస్టర్‌మైండ్ అతడే.. అసలు విషయం చెప్పేసిన టిమ్ డేవిడ్!
Tim David: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై 43 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్సీబీ విజయంలో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేశాడు. డేవిడ్ క్రీజులో ఉన్నంతసేపు ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ సుడిగాలి ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ అని టిమ్ డేవిడ్ వెల్లడించచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిస్థితులు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అక్కడ ఎలా ఆడాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో లోకల్ ఆటగాడు డినేశ్ కార్తిక్ దిట్ట. తన అనుభవాన్ని టిమ్ డేవిడ్‌తో పంచుకున్నాడు. అది డేవిడ్ ఇన్నింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. 'నేను నా ఆటను ఎక్కువగా మార్చను. కానీ ప్రిపరేషన్ వల్ల నాకు నమ్మకం వచ్చింది. డీకే వంటి అనుభవజ్ఞుడితో పని చేయడం ఎంతో ఉపయోగపడింది' అని మ్యాచ్ అనంతరం డేవిడ్ చెప్పాడు.
'చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సాధ్యం కాదు. మా కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను అతనికి జత కలిశాను. మంచి స్కోర్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగాం, అది చాలా సరదాగా అనిపించింది. నేను అదృష్టవంతుడిని. నా బ్యాటింగ్ స్థానాన్ని ఎక్కువగా మార్చడానికి ప్రయత్నించను. ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. నేను చేసే ప్రాక్టీస్ వల్ల దూకుడుగానే ఆడుతా. జట్టు సహచరులు, సపోర్ట్ స్టాఫ్ నుంచి నాకు మంచి మద్దతు లభిస్తోంది. ఇది ప్రతి ఆటగాడికి ఎంతో ముఖ్యం. నా తర్వాత జితేష్ శర్మ, షెపర్డ్ ఉండటం నాకు మరింత ధైర్యం ఇచ్చింది' అని టీమ్ డేవిడ్ తెలిపాడు.
'బెంగళూరులో మేము చేసే ప్రిపరేషన్ చాలా కీలకం. డీకేతో కలిసి పని చేసే అవకాశం రావడం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఆయన అనుభవం అమూల్యం. మేము అనేక విషయాలపై పని చేస్తున్నాం. బేసిక్స్‌ను అలాగే ఉంచుకుని, మెరుగవడానికి ప్రయత్నిస్తున్నా. నేను కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాను. ఆ అనుభవం, ప్రిపరేషన్ వల్ల ఎక్కువ ఒత్తిడి పెట్టుకోను. ఆటను ఆస్వాదిస్తా. చెడు రోజులు కూడా ఉంటాయి. అప్పుడు విమర్శలు కూడా వస్తాయి, అదే క్రికెట్. హై-రిస్క్ అటాకింగ్ క్రికెట్ ఆడేటప్పుడు ఇది సహజం. ట్రైనింగ్‌లో మేము స్టేడియం పైకప్పుపై కొట్టడానికి పోటీ పడతాం. మ్యాచ్‌లో అలా క్లీన్‌గా మిడిల్ నుంచి సిక్స్ (106 మీటర్ల సిక్స్) రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ సమయంలో జేమీ వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ బంతిని స్టేడియం పైకప్పు మీదకు పంపడం నిజంగా సరదాగా అనిపించింది' అని ఆసీస్ హిట్టర్ చెప్పుకొచ్చాడు.


