Coal Mine Explosion : బొగ్గు గనిలో భయంకర పేలుడు, 18 మంది బలి, మట్టి కింద మరొక 24 మంది
Coal Mine Explosion : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బొగ్గు గనిలో మీథేన్ వాయువు లీకై సంభవించిన ఘోర పేలుడులో 18 మంది కార్మికులు మరణించారు.
Coal Mine Explosion
Coal Mine Explosion : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం నాడు ఒక బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడు కారణంగా కనీసం 18 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది కార్మికులు గని లోపల శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఉన్న ఒక బొగ్గు గనిలో ఈ ఘోరం జరిగింది. గని లోపల భూగర్భంలో అత్యంత ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ పేరుకుపోవడం వల్లే ఈ పేలుడు సంభవించిందని ప్రభుత్వ గనుల తనిఖీ అధికారి ఘనీ బలోచ్ ధృవీకరించారు.
సహాయక చర్యలకు ఆటంకాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, రెస్క్యూ బృందాలు గని వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మొదటి కొన్ని గంటల్లో 7 మృతదేహాలను వెలికితీయగా, ఆ తర్వాత మరో 11 మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న 24 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మీథేన్ గ్యాస్ పేలుడు తర్వాత గని లోపల ఆక్సిజన్ స్థాయి పూర్తిగా శూన్యానికి పడిపోతుందని, దీనివల్ల ఎవరైనా సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని రెస్క్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లోపల గాలి ఆడకపోవడంతో రెస్క్యూ బృందాలు కూడా అత్యంత జాగ్రత్తగా ము ముందుకు సాగుతున్నాయి.
పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఈ దుర్ఘటనపై బలూచిస్థాన్ గనులు, ఖనిజాల శాఖ మంత్రి షోయబ్ నోషేర్వాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 5,00,000 పాకిస్థానీ రూపాయల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా గని యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని పాకిస్థాన్ సెంట్రల్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ మండిపడింది. గనుల్లో సరైన వెంటిలేషన్, గ్యాస్ పర్యవేక్షణ వ్యవస్థలు మరియు ప్రాథమిక భద్రతా పరికరాలు లేకపోవడం వల్లే నిర్దోషులైన కార్మికులు బలైపోతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కనీస భద్రత లేకపోయినా బతుకుపోరాటం
పాకిస్థాన్‌లో ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రాంతంలో ఇలాంటి ప్రాణాంతక గని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. బలూచిస్థాన్ పాకిస్థాన్‌లోనే అత్యంత పెద్దది అయినప్పటికీ, తీవ్ర పేదరికం, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. ఎలాంటి కనీస రక్షణ సౌకర్యాలు, సరైన వేతనాలు లేకపోయినా పొట్టకూటి కోసం వేలాది మంది పేద కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రమాదకర బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు. గని యజమానులు భద్రతా నిబంధనలను బొందపెట్టడం వల్ల అమాయక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.




