US Ceasefire: యుద్ధాన్ని ఆపేస్తున్నాం అంటూ ట్రంప్ చల్లని కబురు

US Ceasefire: యుద్ధాన్ని ఐదు రోజులపాటు ఆపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు

KVD Varma
Published on: 23 March 2026 5:37 PM IST
US Ceasefire: యుద్ధాన్ని ఐదు రోజులపాటు ఆపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
X

US Ceasefire

US Ceasefire: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు తొలిగిపోనున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. నిన్నటి వరకూ ఇరాన్ కు అల్టిమేటమ్స్ ఇస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షడు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ పేల్చేస్తానంటూ చెప్పిన డోనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం స్థానంలో శాంతి చేకూరే పరిస్థితులు ఏర్పడే కనిపిస్తున్నాయి.

ఐదు రోజుల విరామం..

అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారు. ఐదు రోజుల పాటు అన్ని సైనిక దాడులను నిలిపివేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలలో సానుకూల పురోగతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ విరామ సమయంలో కూడా చర్చలు కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు.

చర్చలు విజయవంతమైతే, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతను అంతం చేసే దిశగా ఒక పెద్ద ముందడుగు వేయవచ్చని ట్రంప్ అన్నారు. నిజానికి, రెండు రోజుల క్రితం, 48 గంటల్లోగా హోర్ముజ్ మార్గాన్ని తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ కేంద్రంపై భారీ దాడి చేస్తానని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ సంచలన విషయాన్ని ఆయన వెల్లడించారు.

ఇరాన్ మరో మూడు షరతులు విధించింది.

కాల్పుల విరమణ కోసం ఇరాన్ మూడు కొత్త షరతులను విధించినట్లు తెలుస్తోంది. తమ దేశం ముందుగా నిర్ణయించిన ప్రణాళికను అనుసరిస్తోందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఆదివారం లెబనీస్ మీడియా సంస్థ అల్ మయాదీన్‌కు తెలిపారు.

ఇరాన్ మూడు కొత్త షరతులు

  • ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలను మూసివేయడం
  • హోర్ముజ్ జలసంధికి కొత్త నియమాలను ఏర్పాటు చేయాలి
  • ఇరాన్‌కు వ్యతిరేకంగా భావించబడే మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్య తీసుకోవాలి, వారిని అప్పగించాలి.

గతంలో ఇరాన్ కాల్పుల విరమణ కోసం, భవిష్యత్తులో యుద్ధం జరగదని హామీ ఉండాలని, నష్టాలకు పరిహారం ఇవ్వాలని, అలాగే ఈ ప్రాంతం మొత్తంలో కొనసాగుతున్న యుద్ధాలను ముగించాలని ఇరాన్ చెప్పింది.ఈ డిమాండ్లకు అదనంగా మరో మూడు డిమాండ్లను ఇరాన్ చేసిందనే వార్తల నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

హర్ముజ్ పై స్పష్టత వచ్చిందా?

ట్రంప్ సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి అన్నారంటే.. హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ నుంచి స్పష్టత వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ నౌకల రాకపోకలకు అడ్డంకులను ఇరాన్ తొలిగించే దిశగా అడుగులు వేస్తుండవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.

ఏది ఏమైనా.. ట్రంప్ నుంచి వచ్చిన ఈ ప్రకటన మండు వేసవిలో చల్లని వర్షాన్ని తీసుకువచ్చినట్టుగా ఉందనేది నిజం.

KVD Varma

KVD Varma

Next Story