IMEC: భారత్ యూరప్ కారిడార్‌కు ట్రంప్ మద్దతు... ఇరాన్‌కు బిగ్ షాక్
భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ IMECకు ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఇరాన్ నియంత్రణకు దూరంగా పశ్చిమాసియా ఇంధన మార్గాలను మార్చాల్సిన అవసరంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
IMEC: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు అనుసంధానం చేసే ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఈ ప్రాంతంలోని ఇంధన మౌలిక వసతులను ఇరాన్ నియంత్రణకు దూరంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల అవసరాన్ని మరింత స్పష్టంగా చూపించాయని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ ప్రభావం తగ్గించడమే లక్ష్యంగా..
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా గల్ఫ్, అరబ్ దేశాల నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో చమురు రవాణా వ్యవస్థ ఒకే ప్రాంతం లేదా మార్గంపై ఆధారపడటం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ అనుబంధ దాడులు ప్రత్యామ్నాయ మార్గాల అవసరాన్ని తెలియజేశాయని ట్రంప్ అన్నారు. అందుకే మధ్యప్రాచ్యంలోని ఇంధన మౌలిక వసతులను ఇరాన్ నియంత్రణ పరిధికి దూరంగా తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చమురును తరలించేందుకు పైప్‌లైన్లు సహా ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ అసలు అంశం కేవలం ఒక వాణిజ్య కారిడార్ నిర్మాణం మాత్రమే కాదు. చమురు, గ్యాస్ వంటి కీలక ఇంధన వనరులు సురక్షితంగా, అంతరాయం లేకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరేలా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఇందులో కీలకంగా కనిపిస్తోంది.
IMEC ఎందుకు కీలకం?
2023లో ఆవిష్కరించిన IMEC ప్రాజెక్టు భారత్, గల్ఫ్ ప్రాంతం, యూరప్‌ను కొత్త రవాణా, వాణిజ్య మార్గాలతో అనుసంధానించాలనే లక్ష్యంతో రూపొందింది. ఇందులో ప్రధానంగా రెండు కారిడార్లు ఉంటాయి. ఒకటి భారత్‌ను గల్ఫ్ ప్రాంతంతో కలిపే ఈస్ట్రన్ కారిడార్. మరొకటి గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్‌తో అనుసంధానించే నార్తర్న్ కారిడార్. ఈ ప్రాజెక్టులో రైల్వే మార్గాలు, నౌక–రైలు రవాణా వ్యవస్థలు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక వసతులు ఉంటాయి. అంటే సముద్ర రవాణాతో పాటు భూభాగ రవాణాను కూడా కలిపి వేగవంతమైన వాణిజ్య నెట్‌వర్క్‌ను రూపొందించడం దీని ఉద్దేశం. భారత్‌కు ఇది వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. భారత్ నుంచి గల్ఫ్ మీదుగా యూరప్‌కు సరుకుల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడితే వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలకు కూడా కొత్త రవాణా, పెట్టుబడి అవకాశాలు ఏర్పడవచ్చు.
దశాబ్దాల సమస్యలకు పరిష్కారం వస్తుందా?
మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రత, ఇంధనం, రాజకీయ ఉద్రిక్తతలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. చమురు రవాణా మార్గాల భద్రత కూడా ఇందులో కీలక అంశమే. వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన ప్రతిసారీ ఇంధన సరఫరా, రవాణా ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం వంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా, ఇంధన మార్గాలను అభివృద్ధి చేయడం అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అనేక పాత సమస్యలను అధిగమించే దశకు చేరుకున్నామని ట్రంప్ అన్నారు. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాల నేతలతో కలిసి సురక్షితమైన, సంపన్నమైన మధ్యప్రాచ్యం కోసం పనిచేస్తున్నామని చెప్పారు.
ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక
ఇదే సమావేశంలో ట్రంప్ ఇరాన్‌పై మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరిచేశామని, పరిస్థితులు మరింత దిగజారకముందే ఆ దేశం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. అదే సమయంలో ఇరాన్ విషయంలో ఒక దశ దాటితే ఆ దేశాన్ని ఒక దేశంగా కొనసాగించే అవకాశం కూడా లేకుండా పోవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
మొత్తంగా చూసుకుంటే, IMECకు అమెరికా మద్దతు అనేది కేవలం వాణిజ్య ప్రాజెక్టుకు మద్దతు మాత్రమే కాదు. ఇంధన భద్రత, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు, గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు, ఇరాన్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు....ఈ నాలుగు అంశాలు ఒకేసారి ఇందులో కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కారిడార్ విషయంలో భారత్, అమెరికా, గల్ఫ్, యూరప్ దేశాల మధ్య సహకారం ఎంత వేగంగా ముందుకు సాగుతుందనేది కీలకంగా మారనుంది.




