Trump Brazil Tariffs: లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ ఆగ్రహం...టారిఫ్ యుద్ధం
బ్రెజిల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% అదనపు టారిఫ్‌లు విధఙంచారు. పిక్స్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ కారణంగానే ఈ టారిఫ్‌లు విధించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Trump Brazil Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై మరో వాణిజ్య సమరానికి తెరలేపారు. ఈసారి ఆయన నిఘా నేత్రం లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌పై పడింది. అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించే బ్రెజిల్ వస్తువులపై ఏకంగా 25 శాతం అదనపు టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి సంచలన ప్రకటన చేసింది. అమెరికా కంపెనీలకు నష్టం కలిగించేలా బ్రెజిల్ అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వాషింగ్టన్ వర్గాలు స్పష్టం చేశాయి. జూలై 22 నుండి అమల్లోకి రానున్న ఈ సుంకాల దెబ్బకు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ వణికిపోతుండగా.. ఈ వివాదం వెనుక బ్రెజిల్ గర్వంగా చెప్పుకునే 'పిక్స్' డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం.
అమెరికాను రగిలించిన బ్రెజిల్ 'పిక్స్' విజయం
ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు 'పిక్స్' అనే డిజిటల్ పేమెంట్ సర్వీస్. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా తమ దేశ సాంకేతిక సార్వభౌమత్వానికి ప్రతీకగా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. అయితే, 1974 వాణిజ్య చట్టంలోని 'సెక్షన్ 301' కింద అమెరికా జరిపిన సుదీర్ఘ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బ్రెజిల్ ప్రభుత్వం తన సొంత 'పిక్స్' వ్యవస్థకు విపరీతమైన రాయితీలు ఇస్తూ, అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్, వీసా వంటి పేమెంట్ సేవల పోటీని తొక్కేస్తోందని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామీసన్ గ్రీర్ ఆరోపించారు. ఈ విధానాల వల్ల అమెరికన్ ఉద్యోగులు, ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నది అమెరికా ప్రధాన వాదన.
ఏ ఏ వస్తువులపై ప్రభావం? భారీగా నష్టపోయేది ఎవరు?
నూతన నిబంధనల ప్రకారం బ్రెజిల్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే ఇథనాల్ సహా పలు పారిశ్రామిక ఉత్పత్తులపై ఈ 25 శాతం భారం పడనుంది. అయితే, అమెరికాలో వినియోగం ఎక్కువగా ఉండే కాఫీ, బీఫ్ వంటి కొన్ని ప్రాథమిక ఆహార ఉత్పత్తులకు మాత్రం ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చారు. బ్రెజిల్‌కు అమెరికా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడం వల్ల ఈ సుంకాల ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. 2025లో బ్రెజిల్ దాదాపు 45 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందుతో పోలిస్తే 11 శాతం ఎక్కువ. అదే సమయంలో అమెరికాకు బ్రెజిల్ చేసే ఎగుమతులు దాదాపు 7 శాతం క్షీణించాయి.
బ్రెజిల్ ఎన్నికల వేళ రాజకీయ చదరంగం
ఈ అంతర్జాతీయ వాణిజ్య వివాదం కాస్తా బ్రెజిల్‌లో అక్టోబర్‌లో జరగబోయే ప్రెసిడెన్షియల్ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిపోయింది. అధ్యక్షుడు లులా ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు బోల్సోనారో కుమారుడైన సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో ఈ సుంకాల విషయంలో అమెరికా ప్రభుత్వానికి లోపాయికారీగా సహకరించారని అధికార లులా వర్గం ఆరోపిస్తోంది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ.. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా 'పిక్స్' వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేసే ప్రసక్తే లేదని లూలా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అవసరమైతే ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికగా అమెరికాపై ఎదురుదాడికి సిద్ధమౌతోంది. ఈ టారిఫ్ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది తెలియాలి.




