Trump China Visit Analysis:ట్రంప్‌ చైనా పర్యటన విశ్లేషణః దౌత్య నాటకంలో విజేత ఎవరు?

చైనాలో ట్రంప్‌ జరిపిన 43 గంటల పర్యటనలో చివరకు పైచేయి సాధించింది ఎవరు? 43 గంటల్లో ఏం తేల్చారు?

Balachander
Published on: 16 May 2026 12:21 PM IST
Trump China Visit Analysis:ట్రంప్‌ చైనా పర్యటన విశ్లేషణః దౌత్య నాటకంలో విజేత ఎవరు?
X

Trump China Visit Analysis: బీజింగ్ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. బీజింగ్‌లోని చారిత్రక 'ఫొర్బిడెన్ సిటీ' వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన 43 గంటల సుదీర్ఘ పర్యటన ముగిసింది. బాహ్య ప్రపంచానికి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగయ్యాయనే ప్రకటనలు వెలువడినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఈ భేటీలో స్పష్టమైన, శాశ్వతమైన ఒప్పందాలు చాలా తక్కువగా జరిగాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సంక్షోభం కారణంగా 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధి మూతపడటంతో అమెరికా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో, చైనా తన దౌత్యపరమైన పైచేయిని ప్రదర్శిస్తూ అమెరికాను సమాన హోదాలో ఎదుర్కొన్న తీరును, ఇరు దేశాల అవసరాలను, ఎవరికి ఎవరు అవసరం అనే కోణంలో విశ్లేషిద్దాం.

'బోయింగ్స్, బీఫ్ అండ్ బీన్స్' - అమెరికా వాణిజ్య ఆరాటం

ఓ విధంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు గత మూడు నెలలుగా స్వదేశంలో ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. చైనా పర్యటన ద్వారా తక్షణమే పారిశ్రామిక, వ్యవహారిక విజయాలను సాధించాలని ఆరాటపడ్డారు. గత విదేశీ యాత్రలకు భిన్నంగా కేవలం తన అధికార గణంతో పాటు బిజినెస్‌ పర్సన్స్‌తో కలిసి చైనా పర్యటన చేశారు. ప్రధానంగా మూడు అంశాలపై చైనాను ఒప్పించే ప్రయత్నం చేశారు ట్రంప్‌. ఇందులో ప్రధానమైనది బోయింగ్‌ విమానాల అమ్మకం. చైనా దాదాపు 200 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రాథమికంగా అంగీకరించిందని ట్రంప్‌ ప్రకటించారు. అయితే, ఈ కొనుగోలు విషయంలో చైనా కేవలం హామీ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో చైనా ఇలాంటి హామీలు ఇచ్చి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

రెండో అంశం వ్యవసాయ ఉత్పత్తులు. అమెరికా నుండి బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను చైనాకు దిగుమతి చేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇందులో బీఫ్‌ కూడా ఉండటం విశేషం. వీటితో పాటు చైనాకు చెందిన 10 అగ్రగామి సాంకేతిక సంస్థలకు కృత్రిమ మేధస్సుకు అత్యంత అవసరమైన ఎన్విడియా చిప్‌లను విక్రయించేందుకు అనుమతులపై కూడా చర్చలు జరిగాయి. దీనిపై అమెరికా ట్రజరీ సెక్రటరి స్కాట్‌ బెస్సెంట్‌ ఎలాంటి ప్రకటన

మిడిల్ ఈస్ట్ సంక్షోభం - ఇరాన్ అంశం

హోర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని తొలగించేందుకు ఇరాన్‌పై చైనా ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ఆశించింది. వైట్ హౌస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, "హోర్ముజ్ జలసంధి గుండా ఉచిత ఇంధన రవాణా సాగాలని, అక్కడ ఎలాంటి సుంకాలు వసూలు చేయకూడదని" ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదనే పాత నినాదాన్ని ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు.

కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం చాలా వ్యూహాత్మకంగా స్పందించింది. ఇరాన్‌పై నేరుగా ఒత్తిడి తెస్తామని చైనా ఎక్కడా చెప్పలేదు. "సైనిక బలం ప్రయోగించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు, చర్చల ద్వారానే శాంతి సాధ్యం" అంటూ సమదూరాన్ని పాటించింది. చైనా ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని భవిష్యత్తులో అమెరికా నుండి మరింత చమురును కొనుగోలు చేసి, తన ఇంధన వనరులను వైవిధ్యపరుచుకోవాలని చూస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అమెరికా చమురును కొనేందుకు చైనా ఆసక్తి చూపుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీని ప్రభావం నేరుగా సామాన్యుల జేబుపై పడింది.

తైవాన్ సరిహద్దు రేఖ - జపాన్ అంశం

చర్చలు ప్రారంభమైన వెంటనే షీ జిన్‌పింగ్ తైవాన్ అంశంపై చైనా యొక్క 'రెడ్ లైన్' ను స్పష్టం చేశారు. అమెరికా-చైనా సంబంధాలు సజావుగా సాగాలంటే తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ, అమెరికా తన పాత తైవాన్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని, ట్రంప్ ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, చైనాను కలవరపెడుతున్న జపాన్ పునర్మీకరణ అంశంపై ఈ భేటీలో చర్చించడానికి సమయం దొరకకపోవడం గమనార్హం.

తుసిడైడ్స్ ట్రాప్ - కొత్త ప్రపంచ క్రమం

ఈ శిఖరాగ్ర భేటీలో షీ జిన్‌పింగ్ ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో అప్పటికే స్థిరపడిన ఒక మహాశక్తి , ఎదుగుతున్న మరో శక్తిని చూసి భయపడినప్పుడు యుద్ధం అనివార్యమవుతుందని చెప్పే సిద్ధాంతమే 'తుసిడైడ్స్ ట్రాప్'. ఈ ప్రమాదకరమైన ట్రాప్‌లో పడకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ కొత్త శకానికి నాంది పలుకుదామని షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

ఇక్కడ చైనా ఉద్దేశం స్పష్టంగా ఉంది. చైనా అమెరికాను కూలదోయాలని అనుకోవడం లేదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్వారా చైనా ఎంతో లబ్ధి పొందింది. కాబట్టి, అదే ప్రపంచ క్రమంలో తమను కూడా అమెరికాతో సమానమైన నాయకుడిగా గుర్తించాలని, ప్రపంచ వ్యవస్థలో సమాన భాగస్వామ్యం కావాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఈ 43 గంటల భేటీ ద్వారా చైనా అంతర్జాతీయ వేదికపై అమెరికాకు సమానమైన హోదాను దక్కించుకోవడంలో పూర్తిగా విజయవంతమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినా...చివరకు చైనాదే పైచేయి కావడం విశేషం. చైనా కంటే అమెరికాకే ఇప్పుడు చైనా అవసరం ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే ఈ దౌత్య నాటకంలో చివరకు విజేతగా నిలిచింది చైనానే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story