Trump China Tour: ట్రంప్‌ ముందు భారీ సవాళ్లు... చైనాను ఒప్పించగలడా?

మే 14, 15 తేదీల్లో జరగనున్న చైనా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

Balachander
Published on: 13 May 2026 10:34 AM IST
Trump China Tour: ట్రంప్‌ ముందు భారీ సవాళ్లు... చైనాను ఒప్పించగలడా?
X

Trump China Tour: మే 14, 15 తేదీల్లో జరగనున్న చైనా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ విషయంలో తమకు చైనా జోక్యం అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ఇప్పుడు కేవలం దౌత్య పరమైన భేటీ కాకుండా, అమెరికా-చైనా సంబంధాలకు కీలక పరీక్షగా మారింది. ఇరాన్‌ అంశం లేవనెత్తకుండా చైనా సైలెంట్‌గా ఉంటుందా? ఇరాన్‌ అంశాన్ని తెరపైకి తీసుకురాకుండా ట్రంప్‌ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడన్నది ఆసక్తికరం.

ట్రంప్ ధీమా - "మాకు ఎవరి సహాయం అవసరం లేదు"

చైనా పర్యటనకు బయలుదేరే ముందు వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ వ్యవహారంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. "ఇరాన్ విషయంలో మేము ఒంటరిగానే విజయం సాధిస్తాం. ఆ దేశ యుద్ధ యంత్రాంగం ఇప్పటికే కుప్పకూలింది. శాంతియుత మార్గంలో వస్తారో లేదో వారి ఇష్టం.. లేదంటే తదుపరి చర్యలకు మేం సిద్ధం" అని హెచ్చరించారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం 100 శాతం ప్రభావం చూపుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చైనా ముందున్న సంకటం - మిత్రధర్మమా? వాణిజ్యమా?

ట్రంప్ పర్యటనలో చైనాకు ఇరాన్ అంశం అతిపెద్ద సవాలుగా మారనుంది. చైనాతో ఇరాన్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ చమురు ఒప్పందం ఉంది. అంతేకాదు, ఇరాన్‌కు చైనా నుంచి భారీగా ఆయుధాలు, టెక్నాలజీ సరఫరా అవుతున్నాయి. హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా చైనా ఇంధన అవసరాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చైనా ముందు కూడా బలమైన సవాళ్లు ఉన్నాయనే చెప్పవచ్చు. యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికితేనే వాణిజ్యం సజావుగా సాగుతుంది. ట్రంప్‌ మొండి వైఖరి కారణంగా ప్రపంచం యావత్తు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనా ఇందుకు మినహాయింపు కాదు.

ట్రంప్ ముందున్న సవాళ్లు

ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పటికే చైనాలో పర్యటించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో చైనా కచ్చితంగా ఇరాన్ ప్రయోజనాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే, ట్రంప్ తనదైన శైలిలో చైనాను ఎలా దారికి తెచ్చుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికా తన చమురు ఉత్పత్తిని ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి పెంచుతామని చెబుతూ, చైనాను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ట్రంప్ పర్యటన కేవలం రెండు దేశాల మధ్య చర్చలకే పరిమితం కాకుండా, ప్రపంచ భవిష్యత్తును మార్చే శక్తివంతమైన మలుపు కానుంది. ఇరాన్ విషయంలో చైనా మౌనం వహిస్తుందా లేక అమెరికాతో విభేదిస్తుందా అన్నది మరో 48 గంటల్లో తేలనుంది. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఈ పర్యటనను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. చైనా పర్యటన తరువాతైనా పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తాయని భావిద్దాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story