Donald Trump : ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్ సంచలన ప్రకటన.. అంతా పర్ఫెక్ట్ అంటూ ధీమా
Donald Trump : ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అంతా పర్ఫెక్ట్‌గా జరుగుతోందని, కాల్పుల విరమణ దిశగా ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు.
Donald Trump
Donald Trump : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న పోరు త్వరలోనే ముగుస్తుందని, అంతా తాము అనుకున్నట్టే పర్ఫెక్ట్‌గా జరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లాస్ వేగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, అమెరికా సైనిక శక్తి ముందు ఎవరూ నిలబడలేరని, శాంతి స్థాపన కోసం ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. లాస్ వేగాస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా తీసుకున్న చర్యలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. తాము కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని, ప్రస్తుతం అంతా సజావుగా సాగుతోందని చెప్పారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, తమ వ్యూహాల వల్ల ఇరాన్ దిగివచ్చిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు కూడా సిద్ధమైందని ట్రంప్ ఒక పెద్ద బాంబు పేల్చారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర యుద్ధం వల్ల ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం ఇరాన్‌లో 3,000 మంది, లెబనాన్‌లో 2,100 మందికి పైగా మరణించారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఈ పోరులో బలయ్యారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోనూ ప్రాణనష్టం భారీగా ఉంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడటంతో పాటు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపడంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నియంత్రణ, యుద్ధ నష్టపరిహారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు శాంతి చర్చల కోసం ట్రంప్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ నేరుగా లెబనాన్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థతో పోరాడుతున్నప్పటికీ, ఈ ఒప్పందం వల్ల బేరూత్ వంటి నగరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. యుద్ధం వల్ల ఇళ్లు వదిలి వెళ్లిన 10 లక్షల మంది ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ శాంతి ఎంతకాలం ఉంటుందోనన్న ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.




