Iran war: ట్రంప్‌నోట పాతమాటే... ఈసారైనా ముగిస్తారా లేదా?
Iran war: పశ్చిమాసియా సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ట్రంప్ చల్లని మాట చెప్పారు.
Iran war
Iran war: పశ్చిమాసియా సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ట్రంప్ చల్లని మాట చెప్పారు. ఇరాన్‌తో నెలకొన్న సుదీర్ఘ యుద్ధ వాతావరణం ముగింపు దశకు చేరుకుందని, టెహ్రాన్ తనతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న తీవ్రత ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ట్రంప్ చెప్పిన మాటల్లో ఎంత వరకు నిజం ఉంది. ఈసారైనా ముగింపు పలుకుతారా లేదా అన్నది ఆసక్తికరం.
విధ్వంసం తీవ్రత- 20 ఏళ్ల వెనక్కి..
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్ కలిపి జరిపిన దాడుల ఫలితంగా ఆ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా కోలుకోలేని దెబ్బపడిందని ట్రంప్ పేర్కొన్నారు. దాడుల కారణంగా ఇరాన్‌లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోవడానికి కనీసం 20 ఏళ్ల సమయం పడుతుందని ట్రంప్ అంచనా వేశారు. ఇరాన్‌పై దాడి చేయడానికి ప్రధాన కారణం అణ్వాయుధం. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి యూరేనియంను శుద్ధి చేసిందని, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే దాని వలన ప్రపంచానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఉగ్రవాదులకు అణ్వాయుధాలు చిక్కితే ప్రపంచం అంతం అవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ధైర్యంగా దాడులు చేయకుంటే ఈపాటికే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండేవని, అప్పుడు ఆ దేశ పాలకుడిని గౌరవ సూచకంగా సర్ అని పిలవాల్సి వచ్చేదని ట్రంప్ ఓ జర్నలిస్ట్‌తో వ్యంగ్యంగా చెప్పారు.
యుద్ధం ముగిసినట్లేనా?
ట్రంప్ దృష్టిలో యుద్ధం దాదాపు ముగిసిపోయింది. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉందని, తమ మనుగడ కోసమైనా అమెరికాతో రాజీకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేసినా, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. కానీ ఈసారి ఇజ్రాయెల్ సహకారంతో జరిపిన దాడులు ఇరాన్ వెన్నెముకను విరిచేశాయని అమెరికా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అయిందని అంచనా. కానీ, తమ ప్రాదేశిక జలాల్లోకి అమెరికా యుద్ధనౌకలు ప్రవేశిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. తమను ఎవరూ లొంగదీసుకోలేరని, తమవద్ద అంతకు మించేలా ఆయుధాలున్నాయని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు లొంగుతుందా అన్నది సందేహమే. రెండో విడత చర్చల తరువాత పరిణామాలు ఎలా మారతాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ఆందోళన చెందుతుంటే, ట్రంప్ మాత్రం దీనిని ఒక "బిజినెస్ డీల్" లాగా చూస్తున్నారు. ఇరాన్‌ను పూర్తిగా బలహీనపరిచి, తన కండిషన్లకు తలొగ్గేలా చేయడమే ఆయన అసలు వ్యూహం. ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా... ఇరాన్ దిగొస్తుందా చూడాలి.




