Donald Trump : ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. పాకిస్థాన్ విన్నపానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్
Donald Trump : ఇరాన్‌తో కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడగించాడు. పాకిస్థాన్ విజ్ఞప్తితో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.. కానీ హోర్ముజ్ జలసంధి వద్ద నాకాబందీ కొనసాగింపు జరుగుతోంది.
Donald Trump
Donald Trump : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తప్పుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న కాల్పుల విరమణ గడువును పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, దాడులు ఆపినా హోర్ముజ్ జలసంధి వద్ద దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ వ్యవహారంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు తనను వ్యక్తిగతంగా కలిసి విన్నవించుకున్నారని, అందుకే ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం తీవ్ర విభేదాలు ఉన్నాయని, ఒక సరైన ప్రతిపాదనతో వారు చర్చలకు రావడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఏప్రిల్ 22తో ముగియాల్సిన ఈ విరామ గడువును మరికొంత కాలం పొడిగించారు.
దాడులు ఆపినా.. ఇరాన్‌కు ప్రాణాధారమైన హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ తీవ్రంగా స్పందించింది. దాడులు చేయకపోవడం కంటే, సముద్ర మార్గాలను మూసివేయడం తమ దేశానికి తీరని నష్టమని టెహ్రాన్ వాదిస్తోంది. "బొంబార్డింగ్ కంటే దిగ్బంధం ఏమాత్రం తక్కువ కాదు.. దీనికి సైనిక పరంగానే సమాధానం చెప్పాలి" అని ఇరాన్ నేతలు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ఈ పని కేవలం తమపై ఆకస్మిక దాడికి సమయం తీసుకోవడమే తప్ప శాంతి కోసం కాదని వారు ఆరోపిస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వెన్స్ వాస్తవానికి పాకిస్థాన్‌లో పర్యటించి, ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఇరాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిందని, ఒక వర్గం అమెరికాతో రాజీ పడదామని అంటుంటే, మరో వర్గం మాత్రం సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు తగ్గకూడదని పట్టుబడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంతర్గత కలహాల వల్లే ఇరాన్ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.
ఫిబ్రవరిలో మొదలైన అమెరికా-ఇరాన్ సంఘర్షణ ఇప్పుడు ఒక సంక్లిష్టమైన దశకు చేరుకుంది. ఏప్రిల్ 8న మొదలైన రెండు వారాల కాల్పుల విరమణ 22వ తేదీతో ముగియనుంది. ఇప్పుడు దానిని పొడిగించినా, సరిహద్దుల వద్ద రెండు దేశాల సైన్యాలు మాత్రం సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఇరాన్ నుంచి ఒక సమగ్రమైన ప్రతిపాదన వచ్చే వరకు తన సైన్యం అప్రమత్తంగానే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే ఏ క్షణమైనా యుద్ధం మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ ఇచ్చే ఆ ఒక్క ప్రతిపాదనపైనే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశలు పెట్టుకుంది.




