Trump Eyes Chagos Islands: చాగోస్ దీవులపై ట్రంప్ కన్ను...ఇరాన్ చైనాలకు చెక్ పెట్టేందుకు వ్యూహం
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నా, దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించాలన్నా అమెరికాకు చాగోస్ దీవుల అవసరం చాలా ఉంది. ఈ దీవులను సొంతం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.
Trump Eyes Chagos Islands: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన, యుద్ధ వ్యూహాల్లో ముఖ్యమైన దీవులు చాగోస్. ఈ దీవులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అదేవిధంగా అటు చైనా సైనిక వ్యూహాలకు చెక్ పెట్టాలంట అమెరికాకు ఈ దీవులో ఎంతో కీలకం. చాగోస్ దీవులను ముందుగా మారిషస్‌కు అప్పగించి...ఆ దేశం నుంచి ఈ దీవులను కొనుగోలు చేయాలన్నది ట్రంప్ ప్లాన్. ఈ విషయాన్ని ప్రముఖ బ్రిటన్ వార్తాసంస్థ టెలిగ్రాఫ్ తెలియజేసింది. అయితే, ఈ దీవులను మారిషస్‌కు అప్పగించడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం.
స్కాట్ బెసెంట్ ప్లాన్ ఏమిటి?
అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రణాళిక ప్రకారం.. మొదట చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని బ్రిటన్ నుండి మారిషస్‌కు బదిలీ చేయాలి. ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌ను పక్కనపెట్టి, అమెరికా నేరుగా మారిషస్ దేశంతో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవాలనేది ఈ వ్యూహం అంతరార్థం. అయితే ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు రకాల దౌత్యపరమైన ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఈ దీవులను ఆ దేశం వదులుకుంటుందా అన్నది ప్రశ్నార్థకం.
ఇరాన్, చైనాలకు ఎందుకు చెక్?
ఈ దీవుల కొనుగోలు వెనుక బలమైన అంతర్జాతీయ భద్రతా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు అంశాలు అమెరికాను ఆలోచింపజేస్తున్నాయి. ఇందులో ఒకటి చాగోస్ దీవుల సమూహంలో డియాగో గార్సియా సైనిక స్థావరం ఉంది. ఇది అమెరికా యూకే సంయుక్త స్థావరం. ఇరాన్ నుంచి ఈ సైనిక స్థావరం 3800 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం అమెరికాకు ఉంది. గత మార్చిలో జరిగిన క్షిపణి దాడులను అమెరికా యుద్ధనౌకలు తిప్పికొట్టడంతో ఈ బేస్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇక రెండోది చైనా గూఢచర్యం. మారిషస్ దేశానికి చైనాతో ఉన్న సానిహిత్యం అమెరికాకు పెద్ద ఆందోళనగా మారింది. ఒకవేళ ఈ దీవులు మారిషస్ చేతికి వెళ్తే, చైనా అక్కడ గూఢచర్య కేంద్రాలను ఏర్పాటు చేసి అమెరికా కదలికలను నిఘా పెట్టే ప్రమాదం ఉంది. ఇందువల్లనే గత ఏప్రిల్‌లో ఈ దీవుల బదిలీ ప్రతిపాదనకు అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుంది.
60 ఏళ్ల భద్రతా బంధం
గత 60 సంవత్సరాలుగా డియాగో గార్సియా స్థావరం అమెరికా,బ్రిటన్ రక్షణ భాగస్వామ్యంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు, దశాబ్దాలుగా స్వస్థలానికి దూరమైన చాగోస్ శరణార్థుల సమస్య బ్రిటన్ రాజకీయాల్లో నలుగుతోంది. తమకు సొంతగడ్డపై నివసించే హక్కు ఉందని శరణార్థుల సంఘం నాయకుడు లూయిస్ ఒలివియర్ బాంకోల్ట్ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు బ్రేకులు వేయాలన్నా, ఇరాన్ సవాల్‌ను ఎదుర్కోవాలన్నా చాగోస్ దీవులపై సంపూర్ణ పట్టు సాధించడం ట్రంప్ తదుపరి విదేశాంగ విధానంలో అత్యంత కీలకం కానుంది.




