STEM: విదేశీ విద్యార్థులకంటే అమెరికన్లకే ప్రాధాన్యం.. ట్రంప్ కొత్త సైన్స్ పాలసీ

విదేశీ STEM విద్యార్థులపై ఆధారాన్ని తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక సూచించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2026 12:40 AM IST
STEM Students in US
X

STEM Students in US

అమెరికా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విదేశీ విద్యార్థులపై అధికంగా ఆధారపడటం జాతీయ భద్రతకు సవాలుగా మారిందని ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయపడింది. అమెరికా శాస్త్రీయ పరిశోధన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి కీలక సాంకేతిక రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రూపొందించిన "Science: A New Golden Age" నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.

దశాబ్దాలుగా అమెరికా విదేశీ విద్యార్థులకు భారీగా నిధులు కేటాయిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు వెళ్లడాన్ని తగిన భద్రతా ప్రమాణాలు లేకుండానే అనుమతించిందని నివేదిక పేర్కొంది. 2024లో కంప్యూటర్ సైన్స్, గణితశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ ప్రణాళికలు ఉన్న వారిలో దాదాపు సగం మంది తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులేనని వెల్లడించింది.

విదేశీ ప్రతిభపై అధిక ఆధారపడటం వల్ల అమెరికా విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని, దేశీయ ప్రతిభను ప్రభుత్వం తగిన స్థాయిలో ప్రోత్సహించడం లేదని నివేదిక విమర్శించింది. అంతేకాదు, అమెరికాలో శిక్షణ పొందిన ప్రతిభావంతులైన పరిశోధకులను ఇతర దేశాలు తమ సాంకేతిక అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా విద్యా, పరిశోధనా వ్యవస్థలోని స్వేచ్ఛను ప్రత్యర్థి దేశాలు తమ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నాయని, దీనివల్ల పరిశోధనా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని నివేదిక పేర్కొంది. అయితే ఇందులో భారత్ లేదా భారతీయ విద్యార్థుల పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

అలాగే విద్యార్థి వీసాలు, ఉద్యోగ వీసాలు లేదా శాశ్వత నివాస నిబంధనల్లో ఎలాంటి మార్పులను ఈ నివేదిక ప్రతిపాదించలేదు. విశ్వవిద్యాలయాల్లో జాతీయత ఆధారంగా ప్రవేశాలపై పరిమితులు విధించాలని కూడా సిఫార్సు చేయలేదు.

అయినప్పటికీ, అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం (STEM) కోర్సుల్లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పరిశోధన భద్రతకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అయితే భారతీయ విద్యార్థులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాలో దేశీయ శాస్త్రవేత్తలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని నివేదిక సూచించింది. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులను గుర్తించడం, గణితం-సైన్స్ విద్యను బలోపేతం చేయడం, సాంకేతిక శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలను పెంచాలని సిఫార్సు చేసింది. అలాగే అమెరికన్ పీజీ విద్యార్థులు, పోస్ట్‌డాక్టరల్ పరిశోధకులు, యువ శాస్త్రవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించాలని పేర్కొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story