Trump Gaza Plan: గాజా కోసం ట్రంప్ మాస్టర్ ప్లాన్... 66 ప్రాజెక్టులు...2.45 బిలియన్ డాలర్ల నిధులు
గాజా పునర్నిర్మాణానికి ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ 66 ప్రాజెక్టులతో 2.45 బిలియన్ డాలర్ల ఆరు నెలల ప్రణాళికను ప్రకటించింది. నిధులు, భద్రతా సవాళ్లు కీలకంగా మారాయి.
Trump Gaza Plan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గాజా పునరుద్ధరణ కోసం భారీ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. ఆరు నెలల్లో 66 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు 2.45 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. తాత్కాలిక నివాసాల నుంచి ఆసుపత్రుల మరమ్మతులు, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, భద్రత వరకు అనేక అంశాలను ఈ ప్లాన్‌లో చేర్చారు. అయితే ఈ ప్రణాళికలో అసలు ప్రశ్న ఒక్కటే.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
ఆరు నెలల ప్లాన్.. 66 ప్రాజెక్టులు
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 23న ఈ ప్రణాళికను బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధులు వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు సాగిన కసరత్తు తర్వాత ఈ రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. గాజాలో తక్షణ సహాయక చర్యల దశ నుంచి దీర్ఘకాలిక పునర్నిర్మాణం, పాలన వైపు వెళ్లేందుకు ఇది తొలి దశగా బోర్డ్ చెబుతోంది. 66 ప్రాజెక్టులను ప్రధానంగా మౌలిక వసతులు, మానవ అభివృద్ధి, ఆర్థిక పునరుద్ధరణ, డిజిటల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాంతి-భద్రత వంటి విభాగాలుగా విభజించారు.
ముందు ఇళ్లు.. తర్వాత మౌలిక వసతులు
యుద్ధం కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు తాత్కాలిక నివాసాలు కల్పించడం ప్రణాళికలో ప్రధాన అంశం. టెంట్లలో జీవిస్తున్న వారికి సుమారు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఇన్సులేటెడ్ కారవాన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే శిథిలాలను తొలగించడం, పేలని ఆయుధాలను గుర్తించి నిర్వీర్యం చేయడం, ఆసుపత్రులను తిరిగి పనిచేయించేలా మరమ్మతులు చేయడం, రోడ్లు, సరిహద్దు మార్గాలు, విద్యుత్, నీటి వ్యవస్థలను పునరుద్ధరించడం వంటి పనులకు నిధులు కేటాయించారు. మౌలిక వసతుల విభాగానికే సుమారు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో శిథిలాలు, పేలని ఆయుధాల తొలగింపుకు సుమారు 275 మిలియన్ డాలర్లు, ఆసుపత్రుల పునరుద్ధరణకు 50 మిలియన్ డాలర్లు, రోడ్ల మరమ్మతులకు 30 మిలియన్ డాలర్లు ఉన్నాయి.
భద్రతకు కూడా భారీ కేటాయింపులు
గాజా పునర్నిర్మాణం కేవలం భవనాలు కట్టడంతో పూర్తయ్యే పని కాదని బోర్డ్ భావిస్తోంది. అందుకే భద్రతకు కూడా దాదాపు 885 మిలియన్ డాలర్లు కేటాయించే ప్రతిపాదన ఉంది. రఫా ప్రాంతంలో అంతర్జాతీయ స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు అవసరమైన శాశ్వత కేంద్రం, బహుళజాతి భద్రతా దళాల నియామకం, శిక్షణ, పరికరాలు, పాలస్తీనా పోలీసు వ్యవస్థను పునరుద్ధరించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయుధాలను అప్పగించేలా ప్రోత్సహించే కార్యక్రమం, సొరంగాలను గుర్తించి తొలగించే చర్యలు కూడా ప్రణాళికలో ఉన్నాయి.
డిజిటల్ వ్యవస్థ నుంచి చిన్న వ్యాపారాల వరకు
ఈ ప్లాన్ కేవలం అత్యవసర సహాయానికి పరిమితం కాలేదు. గాజా ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టేందుకు చిన్న వ్యాపారాలకు సాయం, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ ఐడీ, 4G కనెక్టివిటీ, ఆరోగ్యం-విద్యకు ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, పెట్టుబడి నిధి వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే గాజాలో దెబ్బతిన్న ఇళ్లు, ఆసుపత్రులు, రోడ్లను మాత్రమే తిరిగి నిర్మించడం కాకుండా.. భవిష్యత్తులో అక్కడ పనిచేసే పరిపాలనా, ఆర్థిక వ్యవస్థకు కూడా పునాది వేయాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశంగా కనిపిస్తోంది.
అసలు సమస్య మాత్రం నిధులే
ఇంత భారీ ప్రణాళిక ఉన్నప్పటికీ దాని ముందున్న అతిపెద్ద అడ్డంకి డబ్బు. బోర్డ్ ప్రకారం దాత దేశాల నుంచి సుమారు 18 బిలియన్ డాలర్ల హామీలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అందులో సుమారు 280 మిలియన్ డాలర్లు మాత్రమే బదిలీ అయ్యాయి అని ప్రణాళికలో పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు మొదటి ఆరు నెలల కార్యక్రమానికే 2.45 బిలియన్ డాలర్లు అవసరం. ఇదే సమయంలో గాజా భౌతిక మౌలిక వసతులను మధ్యకాలంలో పూర్తిగా మరమ్మతు చేయడానికి సుమారు 35.2 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా. వచ్చే పదేళ్లలో పూర్తి పునర్నిర్మాణం, ఆర్థిక పునరుద్ధరణకు అవసరమయ్యే మొత్తం సుమారు 71.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని బోర్డ్ అంచనా వేసింది.
రాజకీయ పరిష్కారం లేకుండా నిర్మాణం సాధ్యమేనా?
ఇక్కడే ఈ ప్రణాళికకు మరో పెద్ద సవాలు ఎదురవుతోంది. గాజాలో పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలంటే నిధులతో పాటు భద్రత, రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. హమాస్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ స్థిరీకరణ దళాల ప్రవేశం, కొత్త పాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి విషయాలపై స్పష్టత అవసరం. బోర్డ్ ఆఫ్ పీస్‌లోని జారెడ్ కుష్నర్ అమలులో కొన్ని అంశాలు ఊహించిన దానికంటే ఆలస్యమయ్యాయని అంగీకరించారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మాత్రం కాల్పుల విరమణ కొనసాగడం, మానవతా సహాయక చర్యలు ముందుకు సాగడం వంటి అంశాలను పురోగతిగా పేర్కొన్నారు.
సూటిగా చెప్పాలంటే.. గాజాను తిరిగి నిలబెట్టేందుకు ప్లాన్ ఉంది, 66 ప్రాజెక్టులు ఉన్నాయి, అవసరమైన నిధుల అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ప్రణాళికను అమలులోకి తీసుకురావడానికి కావాల్సిన డబ్బు, భద్రత, రాజకీయ అంగీకారం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. అందుకే రాబోయే రోజుల్లో ఈ 2.45 బిలియన్ డాలర్ల మొదటి దశకు ఎన్ని దేశాలు నిజంగా నిధులు సమకూరుస్తాయన్నదే కీలకంగా మారనుంది.




