Trump Iran Doha Talks: అమెరికా-ఇరాన్ చర్చలపై కొత్త వివాదం... ట్రంప్, టెహ్రాన్ మధ్య మాటల యుద్ధం
దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను టెహ్రాన్ ఖండించింది. హోర్ముజ్ జలసంధి, అణు చర్చలు, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి తెలుసుకుందాం.
Trump Iran Doha Talks: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉత్కంఠ మళ్లీ పీక్ స్టేజీకి చేరింది. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ సంచలన రీతిలో తోసిపుచ్చింది. తమ వైపు నుండి ఎలాంటి అధికారిక చర్చలు షెడ్యూల్ కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో, అగ్రరాజ్యం ... ఇరాన్ మధ్య అసలు ఏం జరుగుతోందనే గందరగోళం ప్రపంచ దేశాల్లో మొదలైంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే
గత జూన్ 17న ఇరు దేశాల మధ్య కుదిరిన 14-అంశాల అవగాహన ఒప్పందం ప్రకారం 4 నెలలుగా సాగుతున్న రసవత్తర యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా తెరపడింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే, గత గురువారం అదే జలసంధిలో ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ మిలిటరీ చర్యలకు దిగారు.
ట్రంప్ ట్వీట్... ఇరాన్ కౌంటర్
ఈ ఉద్రిక్తతల నడుమ, ఇరానే స్వయంగా చర్చల కోసం అభ్యర్థించింది, దోహాలో ఇరాన్ అణు నిరాయుధీకరణపై మంగళవారం చర్చలు జరుగుతాయి అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. వైట్ హౌస్ కూడా తమ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లను దోహాకు పంపుతున్నట్లు ధృవీకరించింది. కానీ ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ దీనికి పూర్తి భిన్నమైన ప్రకటన చేశారు. తమ సాంకేతిక బృందం ఖతార్ వెళ్తున్న మాట నిజమే కానీ, అమెరికా అధికారులతో ఎలాంటి సమావేశాలు ఖరారు కాలేదని తేల్చి చెప్పారు. పాత ఒప్పందంలోని ప్రాథమిక నిబంధనలను అమెరికా సరిగ్గా అమలు చేయనంత వరకు కొత్తగా ఉన్నత స్థాయి చర్చల ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు మిలిటరీ పరంగా తామే గెలుస్తున్నామని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇరాన్ తమ పట్టు విడువటం లేదు. ఈ దౌత్యపరమైన గిల్లికజ్జాలు గల్ఫ్ రీజియన్‌లో శాంతి ప్రయత్నాలను ఎటు వైపు తీసుకెళ్తాయోననే ఆందోళనలు ఉన్నాయి. హోర్ముజ్ తెరుచుకొని యుద్ధం ముగిస్తే ప్రపంచం శాంతిస్తుంది. లేదంటే ప్రపంచదేశాలు చమురు కొరతతో ఎండిపోక తప్పదు.




