Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ యూటర్న్?.. అసలు టార్గెట్ ఇదే.!

Donald Trump: ఇరాన్‌లో పాలనను మార్చడం తమ ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రధాన లక్ష్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

G Krishna
Published on: 22 Nov 2026 6:22 PM IST
Donald Trump
X

Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ యూటర్న్?.. అసలు టార్గెట్ ఇదే.!

Donald Trump: ఇరాన్‌లో పాలనను మార్చడం తమ ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రధాన లక్ష్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. శాశ్వత ఒప్పందం ద్వారా టెహ్రాన్ వద్ద అణు ఆయుధాలు తయారు కాకుండా అడ్డుకోవడమే తన అసలు ఉద్దేశమని తేల్చి చెప్పారు. శనివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌ను ఎవరు పరిపాలిస్తున్నారు అనే విషయంపై తనకు ఎప్పుడూ అంతగా పట్టింపు లేదని అన్నారు. ప్రస్తుతం చర్చల విషయంలో ఇరాన్ అధికారులతో వ్యవహరించడం చాలా కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.

తాను పదవిలో లేని తర్వాత కూడా అమల్లో ఉండేలా ఒక పక్కా ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వేరే అధ్యక్షుడు వచ్చినా ఆ ఒప్పందాన్ని వెనక్కి తీసుకుని ఇరాన్ అణు ఆయుధాలు అభివృద్ధి చేసేలా అనుమతించకూడదని వాదించారు. నాలుగు, 15 లేదా 20 ఏళ్ల తర్వాత అసమర్థ అధ్యక్షుడు వచ్చినా కూడా మార్చలేని విధంగా శాశ్వత ఒప్పందం చేస్తానని, వైట్‌హౌస్‌లో ఎవరున్నా ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు.

పాలన మార్పు లక్ష్యం కాదన్న ట్రంప్.. సైనిక చర్యపై ఉత్కంఠ

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య తన ప్రభుత్వ లక్ష్యాలపై ట్రంప్ ఈ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టత ఇచ్చారు. 2026 ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఈ ఘర్షణ మొదలైంది. ఆ తొలి దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా, ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఆ బాధ్యతలు చేపట్టారు. తదుపరి చర్యపై తొందరేమీ లేదని, 2027 వరకు వేచి చూడగలనని గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ఛానెల్ 12తో ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరో సైనిక దాడి జరిగే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేని పరిస్థితి ఉంది. సమీప భవిష్యత్తులో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయని సీబీఎస్ న్యూస్ నివేదించింది. ఇరాన్ తన ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పునర్నిర్మించుకుంటుండటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

నిలిచిపోయిన అణు చర్చలు.. ఖతార్ మధ్యవర్తిత్వం

వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో చేసుకున్న ఒప్పందాలను ఇరాన్ పాటించడం లేదని, ఒప్పందాలకు అంగీకరించి ఆ తర్వాత ఉల్లంఘించడం ఇరాన్ అధికారులకు అలవాటుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. ఈ ఉద్రిక్తతల ప్రభావం ఆ ప్రాంతంలో షిప్పింగ్, ఇంధన సరఫరాలపైనా పడింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధనం పరిస్థితిని మరింత వేడెక్కించాయి. మరోవైపు రసాయన లేదా జీవాయుధాల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా ఆరోపణలను టెహ్రాన్ తోసిపుచ్చింది.

ఇరాన్‌పై అమెరికా తన ఆరోపణలను మార్చుకుంటోందని, 2003లో ఇరాక్‌పై అమెరికా దాడిని సమర్థించుకోవడానికి వాడిన వాదనలతో వీటిని పోలుస్తూ ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దౌత్య ప్రయత్నాలు మాత్రం పూర్తిగా ఆగిపోలేదు. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా, ఇరాన్ అధికారులు ఖతార్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సైనిక, ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తున్నప్పటికీ, చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే అన్న కోణాన్ని అమెరికా తెరిచే ఉంచిందని ట్రంప్ తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.