US Iran Tensions: రివర్స్‌ అవుతున్న ట్రంప్‌ ఎత్తులు... తగ్గేదేలే అంటున్న ఇరాన్‌

మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్‌ చూస్తున్నాడు. కానీ, ఇరాన్‌ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 2 Jun 2026 1:14 PM IST
US Iran Tensions:  రివర్స్‌ అవుతున్న ట్రంప్‌ ఎత్తులు... తగ్గేదేలే అంటున్న ఇరాన్‌
X

US Iran Tensions: అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై సాగించిన సైనిక వ్యూహాలు ఇప్పడు ఆయా దేశాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయి. వైమానిక దాడులతో ఇరాన్‌ ప్రభుత్వాన్ని సులభంగా లొంగదీసుకోవచ్చని అనుకున్నారు. కానీ, ట్రంప్‌ అంచనాలన్నీ ఇప్పుడు తలక్రిందులయ్యాయి. గత ఏప్రిల్‌ 8న ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ తరువాత ఇరుపక్షాలు చర్చలకు మొగ్గుచూపినా... తెరవెనుక వ్యూహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచానికి ఇంధన భద్రతకు మూలకారణమైన హోర్ముజ్‌ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయంగా పలు దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయింది. దీంతో ట్రంప్‌ దిగిరాక తప్పడం లేదు.

హోర్ముజ్ జలసంధి... ఇరాన్ చేతిలో వ్యూహాత్మక అస్త్రం

గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. ప్రస్తుతం ఈ మార్గం గుండా కేవలం కొన్ని నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈలు ప్రత్యామ్నాయ పైప్‌లైన్ల ద్వారా కొంత చమురును తరలిస్తున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో ఇంధన కొరత తీవ్రమైంది. అమెరికాకు గల్ఫ్ చమురుపై నేరుగా ఆధారం లేకపోయినా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో అక్కడ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, హోర్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవాలంటే... తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్‌ పట్టుబడుతున్నది.

ఇజ్రాయెల్ మొండితనం – ట్రంప్ ఇరకాటం

మరోవైపు, లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని ఇజ్రాయెల్ చేసిన ప్రకటన ట్రంప్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఇరాన్‌తో అమెరికా ఎలాంటి ఒప్పందం చేసుకోవడాన్ని నెతన్యాహు ఇష్టపడటం లేదు. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇరుపక్షాల మధ్య "సమర విరామ అవగాహన ఒప్పందం" కోసం ప్రయత్నిస్తున్నాయి. ఒప్పందం పూర్తిగా అమలు కావాలంటే ఇరాన్‌ డిమాండ్లను అమెరికా ఒప్పుకోక తప్పదు. ఇరాన్‌ ఒప్పందంలో లెబనాన్‌పై దాడులు కూడా ఆపాలన్నది నియమం. ఈ డిమాండ్‌కు ఇజ్రాయిల్‌ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత అర్ధ శతాబ్ద కాలంగా ఆంక్షలు, ఒంటరితనాన్ని తట్టుకుని నిలబడిన ఇరాన్ పాలకుల పట్టుదలను ట్రంప్ పూర్తిగా తక్కువ అంచనా వేశారు. స్వదేశంలో ఈ యుద్ధానికి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ట్రంప్ వెనక్కి తగ్గలేక, అలాగని ఇరాన్ షరతులకు లొంగలేక సతమతమవుతున్నారు. 2015లో బరాక్ ఒబామా చేసిన అణు ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించిన ట్రంప్, ఇప్పుడు అంతకంటే తక్కువ స్థాయి ఒప్పందానికి ఒప్పుకుంటే అది ఆయన రాజకీయ ప్రతిష్టకు భంగకరంగా మారుతుంది. ఏది ఏమైనా, ఈ ఇద్దరు నేతల తప్పుడు అంచనాల వల్ల గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులు దెబ్బతినడమే కాకుండా, ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించుకుంటోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story