Iran War: ట్రంప్ చెప్పింది నిజమేనా...పశ్చిమాసియా, యూరప్ ముక్కలవుతాయా?
ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక చర్యను డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారి ప్రపంచాన్నే ముక్కలు చేసేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Iran War: ఇరాన్‌పై అమెరికా జరిపిన సైనిక చర్యను డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారి ప్రపంచాన్నే ముక్కలు చేసేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల్లో నిజానిజాలు ఎంత అని తెలుసుకునే ముందు...అసలు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారో తెలుసుకుందాం. ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా జరిపిన B-2 బాంబర్ల దాడిని గట్టిగా సమర్థించుకున్నారు. ఈ దాడి జరగకపోయి ఉంటే, ఈపాటికే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొంది ఉండేదని, దానివల్ల ఇజ్రాయెల్, పశ్చిమాసియా మాత్రమే కాకుండా మొత్తం ఐరోపా ఖండమే ముక్కలు ముక్కలుగా పేలిపోయేదని ఆయన హెచ్చరించారు.
సైనిక చర్యతో బలహీనపడ్డ ఇరాన్
ట్రంప్ విశ్లేషణ ప్రకారం.. అమెరికా జరిపిన మెరుపు దాడుల వల్ల ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా క్షీణించింది. ముఖ్యంగా ఆ దేశ వైమానిక, నావికా దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం కూడా విచ్ఛిన్నమైందని, అక్కడ నాలుగైదు గ్రూపుల మధ్య గందరగోళం నెలకొందని ట్రంప్ వెల్లడించారు. శాంతి చర్చలు తాను ఆశించిన వేగంతో సాగకపోవడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ, అణ్వాయుధ రహిత ఇరాన్‌ను చూడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ ఇరాన్‌లో శుద్ధిచేసిన యూరేనియం నిల్వలు ఉన్నాయి. అణ్వాయుధాలను తయారు చేసుకోనివ్వకుండా ఎవరూ ఆపలేరని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. అణ్వాయుధం ఉంటేనే తమ దేశం భద్రంగా ఉంటుందని హెచ్చరించింది. తమ జోలికి వస్తే శతృవును సముద్రం అడుగున ముంచేస్తామని హెచ్చరించింది. అణ్వాయుధ రహితమైన దేశంగా ఉండాలి అంటే యూరేనియం వారిదగ్గర ఉండకూడదు. బాంబులతో క్షిపణీ వ్యవస్థను నాశనం చేసినంత మాత్రాన అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా ఉంటుందా?
సామాన్యుడిపై ప్రభావం - పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
ఈ యుద్ధం వలన లాభం కంటే నష్టాలే ఎక్కువ మిగిలాయి. ముఖ్యంగా సామాన్యులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం వలన పెరిగిన ఇంధన ధరల గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారంగా మారిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, ఇరాన్‌తో యుద్ధం పూర్తిగా ముగిసి, ఒక గట్టి ఒప్పందం కుదిరిన వెంటనే పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. అణ్వాయుధాలు కలిగిన ఇరాన్ ప్రపంచానికే ముప్పు అని, అటువంటి ప్రమాదాన్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు.
రాజకీయ దుమారం
యుద్ధం విషయంలో అమెరికా కాంగ్రెస్ అనుమతి గురించి డెమోక్రాట్లు చేస్తున్న వాదనను ట్రంప్ కొట్టిపారేశారు. 60 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను తెరపైకి తెస్తున్న వారు దేశభక్తులు కాదని విమర్శించారు. ఏది ఏమైనా, తన నిర్ణయం వల్ల ఒక మహా వినాశనం తప్పిందని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. వినాశనాన్ని ఎవరూ కోరుకోరు. ఇరాన్ ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశంపై కూడా దాడికి దిగలేదు. అటువంటప్పుడు పశ్చిమాసియా, యూరప్ దేశాలపై ఎందుకు దాడి చేస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే...పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్నా, ప్రపంచ ఇంధన మార్కెట్ కుదుటపడాలన్నా ఇరాన్ విషయంలో అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాలే కారణమని ట్రంప్ ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నారు. ఇరాన్ ఇప్పుడు సంధికి సిద్ధంగా ఉన్నా, అమెరికా మాత్రం తమకు పూర్తి సంతృప్తినిచ్చే ఒప్పందం కోసం వేచి చూస్తోంది. భిన్న దృవాల మధ్య సంతృప్తికరమైన ఒప్పందం జరుగుతుందా...?




