Trump Iran War Strategy: అమెరికా ఎన్నికల దెబ్బ.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ వ్యూహం మారనుందా?

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన పరాజయంతో ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ వ్యూహం మారనుందా? మరోసారి సైనిక దాడులా, శాంతి చర్చలా, ఆర్థిక ఆంక్షలా? అమెరికా ముందున్న మూడు మార్గాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 5 Nov 2026 2:43 PM IST
Trump Iran War Strategy: అమెరికా ఎన్నికల దెబ్బ.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ వ్యూహం మారనుందా?
X

Trump Iran War Strategy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్ రూపంలో మరో రాజకీయ, సైనిక సవాల్ ఎదురవుతోంది. ఒకవైపు ఇరాన్‌పై సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా సైన్యం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. మరోవైపు సొంత దేశంలో యుద్ధంపై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బతో ట్రంప్ ప్రభుత్వంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయాలా? చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలతోనే ఒత్తిడి పెంచాలా? అనే అంశాలపై అమెరికా పాలకవర్గంలో చర్చ జరుగుతోంది.

ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక బలగాల మోహరింపు

ఇరాన్‌పై మరోసారి పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లను అమెరికా సైన్యం పూర్తి చేస్తోందని ఆక్సియోస్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే వేల పౌండ్ల మందుగుండు సామగ్రిని సిద్ధం చేసినట్లు సమాచారం. అదనపు యుద్ధ నౌకలు, వైమానిక రక్షణ వ్యవస్థలను మధ్యప్రాచ్య ప్రాంతానికి తరలిస్తున్నారు. మూడో విమాన వాహక నౌక దాడి బృందంతో పాటు మరో మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌ను కూడా ఆ ప్రాంతానికి పంపుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ బలగాల తరలింపుతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికి మరింత పెరగనుంది. మొత్తం మీద అదనంగా సుమారు 10 వేల మంది సైనికులను మోహరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

ట్రంప్ ముందున్న మూడు మార్గాలు

ఇరాన్ విషయంలో ట్రంప్ ప్రధానంగా మూడు అవకాశాలను పరిశీలించాల్సి వస్తోంది. మళ్లీ సైనిక దాడులు... ఇరాన్‌పై వైమానిక, క్షిపణి దాడులను తిరిగి ప్రారంభించడం మొదటి మార్గం. అయితే దీనివల్ల యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగితే ప్రపంచ మార్కెట్లతో పాటు అమెరికాలోనూ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది చర్చల ద్వారా పరిష్కారం. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మరో మార్గం. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ రాజకీయంగా బలహీనపడ్డారని ఇరాన్ భావిస్తే, చర్చల్లో మరిన్ని డిమాండ్లు చేసే అవకాశం ఉంది. దీంతో ఒప్పందం కుదరడం అంత సులభం కాకపోవచ్చు. ఇక మూడోది ఆంక్షలు కొనసాగించడం. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక ఆంక్షలు, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఇరాన్‌పై ఒత్తిడి పెంచడం మూడో మార్గం. అయితే గతంలోనూ ఇలాంటి చర్యలు చేపట్టినా ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు.

యుద్ధంపై ట్రంప్ ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు

ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన పరిణామం ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై కొందరు అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్‌పై మరోసారి దాడులు చేసి అనంతరం శాంతి చర్చలకు వెళ్లాలని ఒక వర్గం భావిస్తుండగా, ఇప్పటికే జరిగిన నష్టాన్ని అంగీకరించి యుద్ధాన్ని ముగించాలని మరో వర్గం కోరుకుంటోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయానికి యుద్ధమే ప్రధాన కారణమని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం వల్ల రాబోయే ఆరేళ్ల పాటు సెనేట్‌లో పార్టీకి రాజకీయంగా నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు కూడా రాజకీయంగా భారంగా మారుతున్నాయని వాన్స్ భావిస్తున్నట్లు సమాచారం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.